
చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి తారస్థాయికి చేరింది. పార్టీ లీడర్లు మూడు గ్రూపులుగా చీలిపోవడంతో ఎవరిని ఫాలో కావాలో తెలియక క్యాడర్ అయోమయానికి గురవుతోంది. జీఎస్టీకి వ్యతిరేకంగా శుక్రవారం ఆందోళనలు చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. దీంతో చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గాలు ఆధిపత్య ప్రదర్శనకు సిద్దమయ్యాయి. నల్లాల ఓదెలు, ప్రేమ్‌సాగర్‌రావు అనుచరుడు నూకల రమేశ్ ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలో వేర్వేరుగా ధర్నా చేశారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ అనుచరులు కిష్టంపేట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
వచ్చే ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు నేతలు తమ ఆధిక్యాన్ని చాటుకుని ...హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవరికీ వారే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి ఇటీవల ఢిల్లీలో ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వీరిని వెంటబెట్టుకుని వెళ్లి మరీ పార్టీలో చేర్పించారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో కలిసి పని చేస్తామని, పార్టీబలోపేతానికి కృషి చేస్తామని ఓదేలు, జనార్ధన్ ఇంతకు ముందు ప్రకటించారు. నెలలు గడవకుండానే ఐక్యత రాగాన్ని మరిచి ఎవరికివారే అన్నట్టు ప్రవర్తించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు చెన్నూరు నుంచి తన అనుచరుడు నూకల రమేశ్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు గ్రూపులుగా విడిపోవడంతో క్యాడర్ పరేషాన్లో పడింది. ముగ్గురిలో ఎవరి వెంట తిరగాలో అర్ధం కావడంలేదని సీనియర్ కార్యకర్తలు అంటున్నారు. ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో తెలియదని, ఈ పరిస్థితిలో ఎవరిని ఫాలో అయినా తర్వాత ఇబ్బంది పడాల్సివస్తుందని చెప్తున్నారు.గ్రూపు రాజకీయాలవల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పడు విభేదాలు రచ్చ కెక్కితే.. ఎన్నికల్లో ముగ్గురు లీడర్లు కలిసి పనిచేసే పరిస్థితి ఉండదని.. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వారు అంటున్నారు. హైకమాండ్ జోక్యం చేసుకుని గ్రూపు రాజకీయాలకు ముగింపు పలకాలని క్యాడర్ కోరుతోంది,