అబ్రహం వర్సెస్​ సంపత్​

అబ్రహం వర్సెస్​ సంపత్​

అలంపూర్, వెలుగు: గద్వాల జిల్లా అలంపూర్​ ఎమ్మెల్యే, టీఆర్​ఎస్​నేత అబ్రహం, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ లీడర్​ సంపత్​ మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఒకరి మీద మరొకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. సోమవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. దీంతో ఉండవల్లిలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షకు వచ్చిన సంపత్​ను టీఆర్ఎస్ వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా  రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది.  
పర్సెంటేజీల మీదే మక్కువ
 ఎమ్మెల్యే అబ్రహంకు పర్సెంటేజీలపై ఉండే మక్కువ అభివృద్ధి మీద  లేదని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. సోమవారం అలంపూర్​లో మీడియాతో  మాట్లాడుతూ, తాను అప్పట్లో వంద పడకల హాస్పిటల్​ ను మంజూరు చేయించానని, ఇంతవరకు దాన్ని నిర్మించలేదని అన్నారు. ఆసుపత్రికోసం జీవో తెస్తే మూడేండ్లయినా భూమిపూజ చేయలేకపోయిన ఎమ్మెల్యే వేస్ట్ ఫెలో, యూజ్ లేస్ ఫెలో  అని అన్నారు.  డబ్బులు తీసుకుని పోస్టింగులు ఇస్తున్నాడని, లిక్కర్ లో, ఇసుకలో కమీషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించారు. పోలీసులు లేకుండా నియోజకవర్గంలో  తిరగలేడని  అన్నారు. 
ఆస్తులపై చర్చకు సిద్దం
‘దమ్ముంటే అలంపూర్ చౌరస్తాకు రా.. నీ ఆస్తులేంటో నా ఆస్తులేంటో తేల్చుకుందా’మని  అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్​ అబ్రహం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్​కు సవాల్​ చేశారు. తన క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సంపత్ కు పిచ్చి కుక్కకరిచి మతిభ్రమించిందన్నారు. సంపత్​ తండ్రి తన క్లాస్ మెంట్ అని, పెద్ద అన్న గౌరవం కూడా లేకుండా వేస్ట్ ఫెలో అన్నడంటే అతడెంత సంస్కారహీనుడో తెలుస్తోందన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను తాను ముద్దాడినట్టు తాను చేసిన అభివృద్ధిని తన ఘనతగా సంపత్​ చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాకముందు సెంటుభూమి లేని సంపత్​కు మణికొండలో ఆస్తులలెట్ల వచ్చాయని ప్రశ్నించారు.  ఇసుక ట్రక్కులను ఆపి మామూళ్లు వసూలు  చేసింది నువ్వా నేనా అని ప్రశ్నించారు. దమ్ముధైర్యం ఉంటే అలంపూర్ చౌరస్తాకు రా నీ ఆస్తులేంటో నా ఆస్తులేంటో తేల్చుదామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దండోరాను అడ్డుకున్న టీఆర్ఎస్,  తోపులాట
సోమవారం ఉండవెళ్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా యాత్రను టీఆర్​ఎస్​ లీడర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అబ్రహంపై  వ్యాఖ్యలకు నిరసనగా  సంపత్ కాన్వయ్ కు అడ్డంగా వెళ్లే ప్రయత్నం చేశారు.  కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోగా ఇరు పార్టీల లీడర్ల మధ్య తోపులాట జరిగింది.  పోలీసులు  పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.