పశ్చిమబెంగాల్ లో హింసాత్మక ఘటనల మధ్యే ముగిసిన ఎన్నికలు

పశ్చిమబెంగాల్ లో హింసాత్మక ఘటనల మధ్యే ముగిసిన ఎన్నికలు

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో శనివారం (జులై 8న) పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో 11 మందికి పైగా మంది మృతిచెందారు. వీరిలో తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ), బీజేపీకి చెందిన కార్యకర్తలు ఉన్నారని తేల్చారు. ఈ హింసాత్మక ఘటనల్లో చాలామంది గాయపడ్డారు. కూచ్‌బిహార్‌ ప్రాంతంలో ఓ యువకుడు ఏకంగా పోలింగ్ బూత్‌ నుంచి బ్యాలెట్ బాక్సును ఎత్తుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

స్వతంత్ర అభ్యర్థి పింటు సింగ్‌ కుమార్తెపై తృణమూల్ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆమె తలపై కాల్చినట్లు వార్తలు రావడంతో తారకేశ్వర్ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ పార్టీ ఖండించింది. దీనిపై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితులు ఆరోపించారు. టీఎంసీ నుంచి టికెట్ రాకపోవడంతో పింటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ప్రస్తుతం ఆయన కుమార్తెకు కోల్‌కతా మెడికల్ కాలేజ్‌లో చికిత్స అందిస్తున్నారు. 

మూడు గంట్లోనే ఎనిమిది హత్యలు జరగటంతోపాటు పోలింగ్ బూతుల్లోనే ఏజెంట్లను నరికి చంపారు. రోడ్లపై తుపాకులతో హంగామా సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూతుల్లోని బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. మరికొన్ని చోట్ల తగలబెట్టారు. బ్యాలెట్ పేపర్లను చింపిపడేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల ఇళ్లపై దాడులు చేశారు. వాళ్ల ఆస్తులకు నిప్పుపెట్టారు. వాహనాలను వీధుల్లో ధ్వంసం చేశారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. భద్రతకు సంబంధించిన కేంద్ర బలగాల భారీ వైఫల్యం వల్లే ఈ తరహా ఘటనలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా 73 వేల 887 పంచాయతీ స్థానాలకు శనివారం (జులై 8న) ఎన్నికలు జరిగాయి. మొత్తం 2.06లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది.