వరదలా ఓట్లు..నడిబజార్ల కొట్లాటలు

వరదలా ఓట్లు..నడిబజార్ల కొట్లాటలు
  • పలు ప్రాంతాల్లో ఆందోళనలు..ఉద్రిక్తతలు
  • పోలింగ్ సెంటర్ల ముందే ఓటర్లకు డబ్బుల పంపిణీ
  • దొంగ ఓట్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి జనం
  • ఎక్కడికక్కడ అడ్డుకున్న పార్టీల కార్యకర్తలు
  • సెంటర్ల ముందు ఓటర్ల బారులు.. భారీగా తరలివచ్చిన యూత్

​ఎన్నికల ముందురోజు వరకు ఓట్ల కోసం ఇల్లిల్లు తిరుగుతూ మనీ, మందు పంచిన కొందరు క్యాండిడేట్లు, పార్టీల లీడర్లు.. పోలింగ్​ రోజు కూడా పంపకాలు సాగించారు. పోలింగ్​ కేంద్రాల ముందే ఈ తతంగం నడిపించారు. నడిబజార్ల నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. దొంగ ఓట్లు వేస్తున్నవారిని  బీజేపీ, కాంగ్రెస్​ నేతలు అడ్డుకున్నారు. అధికార టీఆర్​ఎస్​ నేతలే దొంగ ఓట్లు వేయిస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని వారు మండిపడ్డారు. దీంతో అనేకచోట్ల పోలీసులు  రంగప్రవేశం చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు.  నిజామాబాద్, ఇల్లెందు, మిర్యాలగూడ, పెద్దపల్లి, గద్వాల, గజ్వేల్, నిజాంపేట తదితర మున్సిపాలిటీల్లో ఏకంగా లాఠీ చార్జి చేశారు.  పలువురిపై కేసులు నమోదు చేసి ఠాణాలకు తరలించారు. గతానికి భిన్నంగా పోలింగ్​ సెంటర్ల వద్ద బీజేపీ లీడర్లు, కార్యకర్తలు యాక్టివ్​రోల్​ పోషించారు. కాంగ్రెస్​ నేతలతో, కార్యకర్తలతో కలిసి పోలింగ్​లో అక్రమాలపై గొంతెత్తారు. ఆందోళనకు దిగారు. పలుచోట్ల పోలింగ్​ ఆఫీసర్లు, పోలీసులు అధికారపార్టీకి మద్దతు పలుకుతున్నారని బీజేపీ, కాంగ్రెస్​ నేతలు నిలదీశారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలోని చుక్కాయపల్లి పోలింగ్ స్టేషన్​లో  డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ కృష్ణ  టీఆర్​ఎస్​ తరఫున డబ్బులు పంచుతుండగా, ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కానిస్టేబుల్  బాత్రూంలో దాక్కోవాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఫిర్యాదు చేసిన లీడర్లే అరెస్టు.. ఎంపీ ఆగ్రహం

నిజామాబాద్​కార్పొరేషన్​ పరిధిలోని చంద్రశేఖకాలనీలో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ డబ్బులు, మద్యం పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ, ఇండిపెండెంట్​ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. బీజేపీ అభ్యర్థి సహా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎంపీ అర్వింద్​ సీరియస్​ అయ్యారు. ఫిర్యాదు చేసిన తమ పార్టీ అభ్యర్థిని ఎలా అరెస్టు చేస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇదే జిల్లా బోధన్ ​26వ వార్డులో టీఆర్​ఎస్​ అభ్యర్థి సునీతాదేశాయ్ భర్త  వెంకటేశ్వర దేశాయ్​కు, కాంగ్రెస్​ అభ్యర్థి అనుచరుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురుచేశారు.

పోలింగ్​ కేంద్రాల్లో ఇతరులు

కామారెడ్డి  మున్సిపాలిటీ గంజి హైస్కూల్​లోని 44వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి కొన్ని పార్టీలవారిని పంపుతున్నారంటూ కాంగ్రెస్​ లీడర్లు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 16వ వార్డు ఆశోక్​నగర్​ కాలనీలోని పోలింగ్ కేంద్రంలోకి వార్డుతో సంబంధం లేని వ్యక్తులు ఓట్లేస్తున్నారని కాంగ్రెస్  కార్యకర్తలు ఆరోపించి, ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో  పోలీసులు వారిని చెదరగొట్టారు. వార్డు నంబర్ ఒకటి పరిధిలోని ఇల్చిపూర్​లో ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్  కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యే ర్యాలీ.. ఉద్రిక్తం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తన అనుచరులతో బైక్​ ర్యాలీ తీయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీని కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్​చార్జి  సుభాష్​రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎలా అనుమతిస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

నకిలీ ఐడీలతో దర్జాగా..

మంచిర్యాల మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని హమాలివాడలో కొందరు నకిలీ ఐడీ కార్డులతో ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ మద్దతుదారులు ఆరోపించారు. వేంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పురుషులు, కొందరు మహిళలు కేంద్రానికి  ఓటేయడానికి రాగా, కాంగ్రెస్ ఏజెంట్ పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. మంచిర్యాల 26, 27 వార్డులకు సంబంధించి ట్రినిటీ స్కూల్​లో ఏర్పాటుచేసిన పోలింగ్​ కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఆమె భర్త, మరికొందరు ప్రచారం చేయడంతో బీజేపీ లీడర్లు నిలదీశారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్​చార్జి వెర్రబెల్లి రఘునాథ్​రావు, నాయకులు వెర్రబెల్లి రవీందర్రావు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మళ్లీ మళ్లీ ఓటేసేందుకు వచ్చి..

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్​ 8వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆరోపించారు. ఓసారి ఓటు వేసిన ఇద్దరు మహిళలు మరోసారి రావడంతో ఆందోళనకుదిగారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో లాఠీచార్జి చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 23వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్​ క్యాండిడెట్ల భర్తలిద్దరు కొట్టుకున్నారు. బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ ​బూత్​ బయట కాంగ్రెస్​ అభ్యర్థి భర్త కూన సంతోష్​, టీఆర్​ఎస్​ అభ్యర్థి భర్త వెంకటేశ్వర్లు ఒకరిపై ఒకరు చేయిచేసుకొని  బట్టలు చింపుకున్నారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు.

మంత్రి అల్లుడిపై ఆరోపణలు

పెబ్బెరు మున్సిపాలిటీలో మంత్రి నిరంజన్​రెడ్డి అల్లుడు ఏకంగా పోలింగ్​ బూత్​కు వెళ్లి ప్రచారం చేస్తున్నారంటూ మిగిలిన లీడర్లు అడ్డుకున్నారు.  మహబూబ్​నగర్​ లోని పద్మావతి కాలనీలో ఓబూత్​లోని పోలింగ్​ ఏజెంట్​ అధికార పార్టీకి ఓటేయమని చెబుతుండటంతో బీజేపీ మద్దతుదారులు గొడవకు దిగారు. మక్తల్​లో ఎమ్మెల్యే చిట్టెం రాంమెహన్​రెడ్డి దంపతులు ఓటువేసి వెనుదిరుగుతున్న టైంలో బీజేపీ నేతలతో వాగ్వాదం జరిగింది.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. చాలా చోట్ల బీజేపీ, టీఆర్​ఎస్​ నేతల మధ్య తోపులాటలు జరిగాయి.

బాచుపల్లి 15వ వార్డులో 150 దొంగ ఓట్లు

నిజాంపేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బాచుపల్లి 15 వార్డులో ఇతర జిల్లాల నుంచి వచ్చిన 150 మంది దొంగ ఓట్లేయడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో గొడవకు దిగారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు.

ఏడ చూసినా అదే తంతు

  • పెద్దపల్లి మున్సిపాలిటీ19వ వార్డులో టీఆర్​ఎస్ అభ్యర్థి డబ్బు పంపిణీ చేస్తుండగా, కాంగ్రెస్​ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తిని వదిలి కాంగ్రెస్​ పార్టీకి చెందిన నల్లాల తేజను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి వియ్యంకుడు రాంరెడ్డి అటు వైపు రాగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా,  షాఖీర్​, పృథ్వీరాజ్​, శ్రీకాంత్​ అనే స్థానికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు అక్కడికి చేరుకొని రాస్తారోకో  చేశారు.
  • కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో  ఇద్దరు మహిళలు బురఖాలు ధరించి దొంగ ఓట్లు వేయడానికి వస్తే పోలింగ్ సిబ్బంది గుర్తించి, పోలీసులకు అప్పగించారు.
  • నిర్మల్​లోని 37వ వార్డులో దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన హైమది అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు . అస్మా కౌసర్ పేరుపై హైమది ఓటు వేసేందుకు ప్రయత్నించగా  పోలింగ్ ఏజెంట్లు గుర్తించి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
  • మహబూబాబాద్​ మున్సిపాలిటీలోని 36వ వార్డులో టీఆర్​ఎస్​ నాన్​లోకల్​ నాయకులు ప్రచారం చేస్తున్నారంటూ సీపీఐ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే శంకర్​నాయక్​, ఆయన భార్య సీతామహాలక్ష్మితో కలిసి కృష్ణాకాలనీలోని పోలింగ్​ స్టేషన్ చేరుకొని  సీపీఐ నేతలు విజయ్​సారథి, సుధీర్​రెడ్డిపై బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసులు సీపీఐ నేతలను అక్కడి నుంచి పంపించేశారు.
  • నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 33,45 వార్డుల్లో  దొంగ ఓట్లు పోలయ్యాయనే ఫిర్యాదులు వచ్చాయి.  33 వార్డులో బీజేపీ, టీఆర్​ఎస్​ కార్యకర్తల గొడవ పడడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నల్గొండ పబ్లిక్ స్కూల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దొంగ ఓట్లకు తెరలేపాడు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన కొంతమందిని దొంగ ఓట్లు వేసేందుకు తీసుకురాగా, బీజేపీ నాయకులు గుర్తించి అడ్డుకున్నారు. నల్గొండ పబ్లిక్ స్కూల్​లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బీజేపీ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు. ఆయనపై  బీజేపీకి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • చిట్యాల మున్సిపాలిటీలో ని ఒకటో వార్డు శివనేనిగూడెంలో టీఆర్ఎస్ , ఆల్ ఇండియన్ ఫార్వర్డ్​ బ్లాక్​ కార్యకర్తలు గొడవకు దిగారు.  పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఫార్వర్డ్​బ్లాక్​ అభ్యర్థి  శేపూరి రవి రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు.7వ
    వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గంటేపాక స్వామి  భార్య ప్రేమలత పోలింగ్​కేంద్రం ముందు ఓటర్లకు రూ. 9వేలు పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  10వ వార్డులో ఫార్వర్డ్​ బ్లాక్​  అభ్యర్థి కొడుకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా,అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.5700 స్వాధీనం చేసుకున్నారు.
  • యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని 31వ వార్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలను ఎంఐఎం కార్యకర్తలను  అడ్డుకున్నారు. రెండు పార్టీలకు చెందిన మహిళలు గొడవకు దిగారు. టీఆర్ ఎస్ నేతలకు పోలీసులు లోపాయికారీగా సహకరించారని,  దీంతో పలుచోట్ల టీఆర్ ఎస్ అభ్యర్థులు పోలింగ్ బూత్ లోకి వెళ్లారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలోని 7, 8, 9 వార్డులకు చెందిన పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారంటూ న్యూ డెమోక్రసీ, ప్రతిపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేప్టటారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇల్లెందులోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో అధికారపార్టీ అభ్యర్థులు హల్​చల్​ చేశారు. ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను పోలీసులు తరిమితరిమికొట్టారు.
  • కల్వకుర్తి మున్సిపాలిటీలోని 10, 11, 22 వార్డుల్లో  టీఆర్​ఎస్​ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.  దీంతో  పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.
  • దుందిగల్ మున్సిపల్ తండ-1 పోలింగ్ స్టేషన్ ముందు టీఆర్​ఎస్​ అభ్యర్థి శంకర్ నాయక్ అనుచరులు 50 వేలు పంచుతుండగా  ఎన్నికల అధికారులు పట్టుకున్నారు.  బోడుప్పల్ 6 వార్డు లోనూ డబ్బుల పంపిణీ గురించి   కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కొట్టుకున్నారు.
  • షాద్ నగర్ మున్సిపల్లోని ఒకటో వార్డు లో ఫరూక్ నగర్ ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌తో కాంగ్రెస్‌ నాయకులు వాగ్వాదానికి దిగారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటమాట పెరిగి, ఘర్షణ మొదలైంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
  • జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌ 5వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. టీఆర్ఎస్  అభ్యర్థి ముర్గేశ్​ కిరాయి గూండాలను తీసుకు వచ్చి మహిళలను బెదిరించాడని, పోలింగ్ బూత్ వద్దే ఓటర్లకు డబ్బు పంచుతున్నాడని కాంగ్రెస్ క్యాండిడేట్​ పుష్పగౌడ్ ఆరోపించారు. ఇక్కడ ఓ కాంగ్రెస్ నేత, తన జేబులో  బలవంతంగా డబ్బు పెట్టి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
  •  తాండూర్‌ మున్సిపాలిటీలోని 35వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాస్తున్నారని ఎంఐఎం నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం ముదురుతుండగా, పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

దగ్గరుండి ఓటేయిస్తూ..

జగిత్యాల లోని 41 వ వార్డు  పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్ నేతలు కూర్చొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులు టీఆర్​ఎస్​కు  వంత పడుతున్నారంటూ సీఐ జయేష్ రెడ్డి పై జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.  19 వ వార్డు లో పోలింగ్ అధికారి వృద్ధులతో టీఆర్​ఎస్​కు ఓటు వేయిస్తున్నారంటూ కాంగ్రెస్ , బీజేపీ నేతలు ఆందోళన చేశారు.