
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. 2 వేల 652 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4 లక్షల 85 వేల 826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు.
11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే హాల్‌టికెట్లు అందచేశారు. కార్యాలయ వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో కూడా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. పరీక్షా కేంద్రాల్లో డీఈవోలు మౌలిక వసతుల పరిశీలన పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామాగ్రి పంపిణీ, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్ష విధులకు నియమించిన సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తైంది.
ఆరోగ్యశాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎం అందుబాటులో ఉండడనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అందుబాటులో TSRTC బస్సులను ఉంచారు.