భీమదేవరపల్లి, వెలుగు : ‘మా బిడ్డ శ్రీవర్షిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోలేదు.. ఆమెను చంపి వేలాడదీశారు’ అని హనుమకొండ జిల్లా వంగరలోని పీవీ రంగారావు రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత తండ్రి తిరుపతి ఆరోపించారు. స్కూల్‌లో మంగళవారం పేరెంట్స్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షిత తల్లిదండ్రులు, బంధువులు స్కూల్‌లోని డార్మెటరీ హాల్‌ను సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వర్షిత తండ్రి తిరుపతి మాట్లాడుతూ... వర్షిత ఉరి వేసుకొని ఉంటే ఆమె ముఖం గోడ వైపు ఉండాలని, కానీ ఉల్టా ఎందుకు ఉందని, సీలింగ్ తమకే అందడం లేదని, వర్షితకు ఎలా అందిందని ప్రశ్నించారు.
స్కూల్ సిబ్బంది పనితీరును వర్షిత ప్రశ్నించడంతో శుక్రవారం ఉదయం ఆమెను వేధించారని, ఈ విషయాన్ని తన కూతురు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే స్కూల్‌కు చేరుకున్నారన్నారు. ప్రార్థన జరిగిన తర్వాత ఫేస్ అటెండెన్స్ వేసే క్రమంలో వర్షిత కనిపించలేదని, ఆ పదినిమిషాల సమయంలో డార్మెటరీ రూంలో ఏం జరిగిందో తెలియాలన్నారు. పాప మృతిపై సందేహాలు ఉన్నాయని, టీచర్ల భయంతో తోటి విద్యార్థులు ఏం చెప్పడం లేదన్నారు. తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ వర్షిత ఆత్మహత్య చేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. మీటింగ్‌లో శ్రీరామోజు శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, ఆవుల రాజయ్య, షేక్ అలీ, లింగన్న, శ్రీరామోజు ముండయ్య, వల్లాల రమేశ్, రఘు, నాయకులు ప్రదీప్‌రెడ్డి, గజ్జల సంజీవ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
