శ్రీశైలం పవర్ ప్లాంట్ లో నెల రోజులైనా క్లీనింగే కాలె

V6 Velugu Posted on Sep 16, 2020

  • 15 రోజుల్లో 2 యూనిట్లు సిద్ధం చేస్తామన్న జెన్​కో సీఎండీ
  • రోజుకు 21 ఎంయూలను కోల్పోతున్న జెన్​కో
  • ప్రాజెక్టులో ఫుల్​గా నీళ్లున్నావాడుకోలేని పరిస్థితి
  • కుడిగట్టు నుంచి రోజూ 15 ఎంయూలు ఉత్పత్తి చేస్తున్న ఏపీ జెన్​కో

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం హైడల్​ పవర్​ ప్లాంట్​లో ప్రమాదం జరిగి 27 రోజులైనా క్లీనింగ్​ పనులే ఇంకా పూర్తికాలేదు. 15 రోజుల్లో ప్లాంట్‌‌ను సిద్ధం చేసి.. ఆరు యూనిట్లలో రెండింటి నుంచి పవర్​ జనరేట్​ చేస్తామని జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్​రావు చెప్పినా అది మాటలకే పరిమితమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజన్‌‌లో కరెంటు ఉత్పత్తి అయ్యే చాన్స్​ కనిపించడం లేదు. ఇక ప్రమాదంపై సీఐడీ విచారణ పూర్తి చేసి రిపోర్ట్​ రెడీ అయినా అది ప్రభుత్వానికి అందలేదు.

జెన్‌‌‌‌ కో వేసిన ఎక్స్‌‌‌‌పర్ట్స్​ కమిటీలోని ముగ్గురు ఆఫీసర్లు కరోనా బారిన పడడంతో ఆ నివేదిక కూడా సిద్ధం కాలేదు. దీంతో ప్రమాద కారణాలు బయటపడలేదు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో అనుకున్న దాని కంటే ఎక్కువ నీళ్లే ఉన్నా పవర్ జనరేట్​ కావడం లేదు. ఏపీ జెన్​కో కుడిగట్టు నుంచి రోజుకు 15 మిలియన్‌‌‌‌ యూనిట్లకుపైగా ఉత్పత్తి చేస్తుంటే.. తెలంగాణ జెన్‌‌‌‌కో రోజుకు 21 మిలియన్‌‌‌‌ యూనిట్ల పవర్​ను కోల్పోతోంది.

కుడిగట్టు నుంచి రోజూ 15 ఎంయూలు

ఏపీ జెన్‌‌‌‌కో 770 మెగావాట్ల విద్యుత్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ నుంచి శ్రీశైలం నీటిని వాడుకుని పవర్​ జనరేట్​ చేస్తుండగా.. తెలంగాణ జెన్‌‌‌‌కో రోజుకు 21మిలియన్‌‌‌‌ యూనిట్ల విద్యుత్‌‌‌‌ను కోల్పోవాల్సి వస్తోంది. ఏపీ జెన్‌‌‌‌కో కుడిగట్టు నుంచి రోజుకు 15 ఎంయూల విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లలో రోజుకు 15.70 మిలియన్‌‌‌‌ యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, ఏపీ జెన్‌‌‌‌కో 15.27, 15.43, 15.29 ఎంయూలు ఉత్పత్తి చేసుకుంటోంది. శ్రీశైలం పవర్​ ప్లాంట్​ కెపాసిటీ 900 మెగావాట్‌‌‌‌లు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 21 మిలియన్​ యూనిట్ల పవర్​ జనరేట్​ చేయవచ్చు. కానీ ప్రమాదం కారణంగా ప్లాంట్​ మూతపడి ఒక్క యూనిట్​ కూడా ఉత్పత్తి కావడం లేదు.

లాస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ శ్రీశైలం నుంచే 1,993 ఎంయూలు

రాష్ట్రంలోని హైడల్​ పవర్​ ప్రాజెక్టుల ద్వారా 2019 ఏప్రిల్‌‌‌‌ నుంచి 2020 మార్చి వరకు 4,509.2 మిలియన్‌‌‌‌ యూనిట్ల పవర్​ జనరేట్​ అయ్యింది. ఇందులో శ్రీశైలం నుంచే 1,993.1 ఎంయూలు ఉత్పత్తి జరిగింది. 2019 ఆగస్టులో 398.1 ఎంయూలు, సెప్టెంబర్​లో 487.0 ఎంయూలు, అక్టోబర్​లో 500.7 ఎంయూలు, నవంబర్​లో 232.2 ఎంయూలు పవర్​ జనరేట్​ అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ప్రమాదం జరిగిన ఆగస్టు 20 వరకు 790.47 మిలియన్‌‌‌‌ యూనిట్ల ఉత్పత్తి మాత్రమే జరిగింది. అంటే నిరుడుతో పోలిస్తే భారీగా విద్యుత్‌‌‌‌ ఉత్పత్తిని కోల్పోవాల్సి వచ్చింది.

సగానికి పడిపోయిన ఉత్పత్తి

రాష్ట్రంలో హైడల్‌‌‌‌ పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌ సగానికి పడిపోయింది. ఏటా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే వానాకాలంలోనే పవర్‌‌‌‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇటీవల ప్రాజెక్టుల్లోకి అనుకున్నదాని కంటే ఎక్కువగానే నీరు వచ్చినా శ్రీశైలం ప్లాంట్‌‌‌‌ ప్రమాదంతో పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో రోజుకు 45 నుంచి 47 మిలియన్‌‌‌‌ యూనిట్ల వరకు హైడల్​ పవర్​ ఉత్పత్తి కావాల్సి ఉండగా.. ప్లాంట్​ ప్రమాదం వల్ల 26 ఎంయూలకు మించి ఉత్పత్తి కావడం లేదు. ఇక ట్రాన్స్‌‌‌‌కోకు 22 మిలియన్‌‌‌‌ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని రివర్స్‌‌‌‌ చేసుకుంటూ రెండు నెలల పాటు పవర్​ జనరేట్​ చేసుకునే వీలున్నా.. ప్రమాదం కారణంగా జెన్‌‌‌‌కోకు, ట్రాన్స్‌‌‌‌కోకు రెండు విధాలా నష్టం ఏర్పడింది.

ఈ సీజన్‌‌‌‌లో ఉత్పత్తి లేనట్లే..

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ సీజన్‌‌‌‌లో కరెంటు ఉత్పత్తి అయ్యేది అనుమానమేనని తెలుస్తోంది. జపాన్‌‌‌‌తో వందేండ్ల వరకు ఒప్పందం, 30 ఏండ్ల లోన్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ ఉన్న ఈ ప్లాంట్‌‌‌‌ పునరుద్దరణ ఇప్పట్లో పూర్తి కావడం కష్టమేనని సమాచారం. మరో పది రోజుల వరకు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ప్లాంట్‌‌‌‌లోని జీఐఎస్‌‌‌‌ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు సంబంధించి 26 వేల లీటర్ల ఆయిల్‌‌‌‌ ప్రమాదంలో కాలిపోయింది. ఇంకా క్లీనింగ్‌‌‌‌ ప్రక్రియ కొనసాగుతోంది. హడావుడిగా యూనిట్‌‌‌‌లు ప్రారంభిస్తే ప్రమాదకరమని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు.

ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల నష్టం

శ్రీశైలం ప్లాంట్‌‌‌‌ ప్రమాదంతో విద్యుత్‌‌‌‌ సంస్థలకు 27 రోజుల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం జరిగింది. ఈ ప్రమాదంతో రోజుకు రూ.20 కోట్లకుపైగా జెన్‌‌‌‌కో ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతోంది. మరోవైపు పవర్​ జనరేట్​ కాకపోవడంతో మరో రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేసి కరెంటు కొనాల్సి వస్తోంది. అంటే విద్యుత్‌‌‌‌ సంస్థలు నెలకు రూ.1,200 కోట్ల వరకూ నష్టపోవాల్సి వస్తోంది.

Tagged plant, accident, srisailam, WORK, completed, cleaning, 27 days, hydel power

Latest Videos

Subscribe Now

More News