
కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. విజయశాంతి ఐపిఎస్ ఆఫీసర్‌గా కీలకపాత్ర పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది 21వ చిత్రం. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. కేవలం ఈ సీన్స్ కోసం ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఖర్చు చేసిన క్లైమాక్స్ ఇదే కావడం విశేషం. బ్రహ్మ కడలి వేసిన మ్యాసీవ్ సెట్స్‌లో రామకృష్ణ యాక్షన్ కొరియోగ్రఫీలో..
కళ్యాణ్ రామ్, ప్రముఖ తారాగణంతో పాటు దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సీన్స్ తీశారు. సినిమా నెరేటివ్‌లో ఈ పార్ట్ హైలైట్ గా ఉండబోతోందని, ఎంతో గ్రాండియర్‌గా, హ్యూజ్ స్కేల్‌లో ఈ సన్నివేశాలు తీసినట్టు మేకర్స్ చెప్పారు. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.