బడులు మూసి.. బార్లు తెరుస్తున్రు

బడులు మూసి.. బార్లు తెరుస్తున్రు

సర్కారుపై లక్ష్మణ్ ఫైర్
పేద పిల్లలకు చదువు దూరమైతది
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?

న్యూఢిల్లీ, వెలుగురాష్ట్రంలో టీఆర్ఎస్​ సర్కారు బడులు మూసి, బారులు తెరుస్తోందని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​లక్ష్మణ్​ విమర్శించారు. విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడిచేలా, ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న లక్ష్మణ్​ బుధవారం తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. సర్కారు స్కూళ్లలో సగానికి పైగా స్కూళ్లను మూసేయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటుచేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో 26,054 ప్రభుత్వ బడులు ఉంటే, కేసీఆర్ సర్కార్ 12 వేల పాఠశాలలను క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగానే 5 కి.మి.లకు ఒక ప్రభుత్వ పాఠశాల నిబంధన తీసుకురావాలని యోచిస్తోందన్నారు. దీంతో గ్రామీణ స్థాయిలో దాదాపు 70శాతం మంది పేద, బడుగు, బలహీన కుటుంబాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గిన స్కూళ్లను మూసేయాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం.. విద్యార్థులను చేర్పించడంలో శ్రద్ధ చూపడంలేదని లక్ష్మణ్​ ఆరోపించారు.

‘మా పిల్లలకు చదువులు.. మీ పిల్లలకు బర్లు, గొర్లు’

‘మాకు పదవులు.. మా పిల్లలకు చదువులు.. మీకు, మీ పిల్లలకు బర్లు, గొర్లు’ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. సంక్షేమ పథకాలు పేరుతో దశల వారీగా కేసీఆర్ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఏటా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కోత పెడుతున్నారని మండిపడ్డారు. 2014–15లో 10.8శాతం నిధుల్ని కేటాయించిన రాష్ట్ర సర్కార్, 2018–-19 సంవత్సరానికి కేవలం 7.6 శాతం నిధులతో సరిపెట్టిందని విమర్శించారు. విద్యావిధానంపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా సర్కారు తీరుమారడంలేదన్నారు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యాస సామర్ద్యాల పట్టికలో తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే 11వ స్థానం,  కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుంటే 15 వ స్థానంలో ఉందని తెలిపారు.

జేపీ నడ్డాతో భేటీ..

ఢిల్లీ పర్యటనలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసినట్లు లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన, తాజా పరిస్థితులు, సమ్మె వివరాలను పార్టీ అధిష్టానానికి అందించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి, జాతీయ రహదారిని 44 ను పారిశ్రామిక కారిడార్ గా గుర్తించాలని కోరినట్లు లక్ష్మణ్​ కోరారు.

మరిన్ని వార్తల కోసం