మునుగోడు ఉప ఎన్నికపై సీఎల్పీ చర్చ

మునుగోడు ఉప ఎన్నికపై సీఎల్పీ చర్చ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం (సీఎల్పీ) అత్యవసరంగా సమావేశమైంది. ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో లేని కారణంగా జూమ్ వేదికగా వర్చువల్ భేటీ జరిగింది. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సీనియర్లలో భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రానున్న మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై  సీఎల్పీలో చర్చించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తో ఫైట్ చేస్తానంటే కాంగ్రెస్ ఎన్నడైనా అడ్డుపడ్డదా అని ప్రశ్నించారు. పోరాడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదన్నారు. గత 3 ఏళ్ళలో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఒక్కటైనా ఉందా అని వ్యాఖ్యానించారు. ‘నీ పోరాటానికి పీసీసీ పదవే అడ్డం వచ్చిందా ? అందరూ అలాగే అనుకుంటే ఎవ్వరు కాంగ్రెస్ లో ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు. ‘హుజూరాబాద్ కు మునుగోడుకు పోలికే లేదు.. సంబంధమే లేదు’ అని చెప్పారు.