‘ఆ జీవో విడుద‌ల సీఎం కేసీఆర్ కి తెలియకుండానే జరిగిందా?’

‘ఆ జీవో విడుద‌ల సీఎం కేసీఆర్ కి తెలియకుండానే జరిగిందా?’

సీఎం కేసీఆర్ కి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? లేదా పార్టీ, కుటుంబం ముఖ్యమా? అంటూ ప్ర‌శ్నించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నీళ్లు-నిధులు-నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు విష‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్ లో భ‌ట్టి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 3టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తామని జీవో విడుదల చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు సామర్థ్యం తగ్గిస్తే-ఏపీ ప్రభుత్వం పెంచుతూ వెళ్తోందని, తెలంగాణ తగ్గించిన నెల రోజులకు ఏపీ పెంచినట్లు జివో విడుదల చేసిందన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పోతిరెడ్డిపాడు అంశంలో మాట్లాడుకుని చేస్తున్నారా ?అనే అనుమానం ఉందని అన్నారు.

“జ‌గ‌న్-కేసీఆర్ రోజు మాట్లాడుతున్నారు అంటున్నారు ఈ జీవో విడుద‌ల సీఎం కేసీఆర్ కి తెలియకుండా జరిగిందా?”అని భట్టి ప్ర‌శ్నించారు. ‌ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసేంత వరకు తెలంగాణ ఇంటలిజెన్స్ ఏం చేస్తోంద‌ని, పోతిరెడ్డిపాడు పై జగన్-కేసీఆర్ మాట్లాడు కోలేదనే గ్యారెంటీ ఏంటని ఆయ‌న అడిగారు. నదీజలాల పంపకాల విషయం అపెక్స్ కమిటీ-బోర్డ్ లో చర్చించకుండానే జీవో విడుదల చేసిందా? అని ప్ర‌శ్నించారు

ఆనాడు పోతిరెడ్డిపాడు కోసం రక్తం మరిగిపోతుందన్న కేసీఆర్.. ఇవ్వాళ సీఎంగా ఉన్నప్పుడు ఇంకెంత‌లా మరగాలి రక్తం? అని ఎద్దేవా చేశారు. 90శాతం పూర్తి అయిన ప్రాజెక్టులను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రీడిజైన్ పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు. ఖమ్మం జిల్లాకు నీళ్ల కోసం శబరినది ఇందిరా సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 శాతం పూర్తి అయింద‌ని, కేసీఆర్ సీఎం అయ్యాక – తెలంగాణ రాష్ట్ర ప్రజలు శబరినదిని కోల్పోయార‌ని అన్నారు. కేసీఆర్ తన ఆర్థికపరమైన లావాదేవీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని భ‌ట్టి ఆరోపించారు.

సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి పై త‌మ‌కు అనుమానాలు ఉన్నాయని..గతంలో శబరినదిని ఇలానే వదిలేశారు కాబట్టి ఇప్పుడు పోతిరెడ్డిపాడు పై న్యాయ పోరాటానికి వెళ్తామని అన్నారు. కేసీఆర్-జగన్ అన్నదమ్ములు అంటే– వాళ్ళ ఇంటి వ్యవహారం కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అనేది మర్చిపోవద్దని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

CLP leader bhatti vikramarka serious comments on kcr sarkar over pothireddypadu issue