
గత నాలుగు నెలల నుంచి తెలంగాణ ప్రజలు కరోనా వల్ల భయం గుప్పిట్లో బతుకుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఫామ్ హౌస్‌కి వెళ్లారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి సీఎం, ఇలాంటి ప్రభుత్వం ఉండడం మన దౌర్భాగ్యమని అన్నారు. ఉన్న అప్పులు సరిపోవడం లేదని మళ్ళీ కొత్త అప్పుల కోసం ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం తీసుకున్నారు. ఈ నాలుగైదు నెలల్లో మరో 30వేలు కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడున్న 3లక్షల కోట్ల అప్పులను ఐదారు లక్షల కోట్ల అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు. తేవాలనుకుంటున్న అప్పుల పై శ్వేతపత్రం విడుదల చేయాలి అని భట్టి డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రజలకు అవసరాలైన వైద్య-విద్యను పక్కకు పెట్టి.. సెక్రటేరియట్ కూల్చడం, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం వంటి పనులు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కాకుండా-రాష్ట్రం దొరికింది కదా అని- స్వాహా చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి తన ధన దాహాన్ని ఆపి, ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు.
సీఎం కుమారుడు కేటీఆర్ కి స్టైల్ గా ఇంగ్లీష్‌లో మాట్లాడటం తప్ప, పరిపాలన మాత్రం చేయరావడం లేదన్నారు. కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టింపు లేదని, విద్యా సంవత్సరం మొదలవుతుందని, పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. కరోనా పరిస్థితులపై మంత్రి ఈటలకు స్వయంగా లేఖ ఇచ్చామని, ఉస్మానియా ఆసుపత్రి ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన హాస్పిటల్ నిర్మించాలని ఆరేళ్ళ కిత్రం చెప్పినా పట్టింపు లేదని అన్నారు.