ఉత్తమ్​ పార్టీ మార్పు ప్రచారం ఓ కుట్ర..బీజేపీ, బీఆర్ఎస్ ​కలిసే ఈ పని చేస్తున్నయ్​

ఉత్తమ్​ పార్టీ మార్పు ప్రచారం ఓ కుట్ర..బీజేపీ, బీఆర్ఎస్ ​కలిసే ఈ పని చేస్తున్నయ్​

కేతేపల్లి (నకిరేకల్), వెలుగు: నల్లగొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారం ఓ కుట్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ జిల్లా కేతే పల్లి మండలంలోని ఉప్పలపాడులో శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.  బీజేపీ, బీఆర్ఎస్​కలిసి ఉత్తమ్​కుమార్ రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ను బలహీనపరచాలని చూస్తున్నాయన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న బలమైన సంకేతాలు రావడంతో ఇలా అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.  

 పీపుల్స్​ మార్చ్​ కు వంద రోజులు

భ‌‌ట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాద‌‌యాత్ర శుక్రవారంతో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌‌ర్భంగా కేతేప‌‌ల్లి మండ‌‌లం ఉప్పలపాడులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌‌ర్ రెడ్డి  కేక్ క‌‌ట్ చేసి భట్టికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, పీసీసీ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి భట్టికి అభినందనలు తెలిపారు. మాజీ మావోయిస్టులు  హరి భూషణ్, సునీత, సాయిరెడ్డి, రేణుక, మంజుల ఆధ్వర్యంలో 90 మంది  ఉప్పలపాడుకు వచ్చి సంఘీభావం తెలిపి పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. 100వ రోజు యాత్ర కేతపల్లి మండల కేంద్రం నుంచి చీకటి గూడెం, ఉప్పలపాడు, భాగ్యనగరం మీదుగా కొప్పోలు వరకు కొనసాగింది.