కాంగ్రెస్​వి గ్యారంటీ హామీలు.. కేసీఆర్ వి గాలి మాటలు : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 

కాంగ్రెస్​వి గ్యారంటీ హామీలు.. కేసీఆర్ వి గాలి మాటలు : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 

ముదిగొండ, వెలుగు: కాంగ్రెస్​వి గ్యారంటీ మాటలు.. కేసీఆర్​వి గాలి మాటలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని, ఆకలి చావులు ఇందిరమ్మ పాలనలో ఉన్నాయని అనడానికి కేసీఆర్​కు బుద్ధి ఉందా అని ఆయన మండిపడ్డారు.  మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి, పెద్దమండవ, వల్లభి గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో, బాణాపురంలో విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తుందన్నారు. అందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యం, భూసంస్కరణ తీసుకువచ్చి పేదలకు భూమిని పంచినదే ఇందిరమ్మ రాజ్యం అని తెలిపారు. వైఎస్సార్ ​ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణమే ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఇది మరిచి  కేసీఆర్​ తాను వచ్చాక కరెంటు వచ్చిందని మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ అనే ఓ బండరాయిని రత్నం అనుకోని పదేళ్లు నెత్తిన పెట్టుకున్న ప్రజలు బండకేసి బాదటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్​ లాంటివాళ్లు 100 మంది వచ్చి మధిరలో సభ పెట్టినా తనను ఏమీ చేయలేరన్నారు. కేసీఆర్ ​గజ్వేల్ లో గెలవలేనని కామారెడ్డి వెళ్లడని, అలాంటి అతడు మధిరలో పెట్టిన అభ్యర్థి ఏం గెలుస్తారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను లెక్కలతో సహా అసెంబ్లీలో నిలదీయడంతోనే దళిత బంధు తెరమీదకు తెచ్చారన్నారు. ధరణి గురించి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. మధిరలో తాను 50 వేల మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. 

భట్టికి సాటిలేరు.. : కల్వకుంట్ల రమ్యరావు 

భట్టి విక్రమార్క పై మధిరలో పోటీలో పెట్టడానికి మూడు రోజులు కేసీఆర్​ నిద్రలేని రాత్రులు గడిపారని, భట్టికి సాటి ఎవరూ లేరని కల్వకుంట్ల రమ్య రావు తెలిపారు. మంగళవారం ముదిగొండ మండలం బాణాపురంలో ప్రచారంలో ఉన్న బట్టి ఆమె కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్​ మధిరాలో ఎవరిని పోటీలో పెట్టాలని ఎంత ఆలోచించినా నిలబడటానికి ఎవరు దొరకకపోవడంతో ఎట్టకేలకు బోడి లింగాలలో ఈడోలింగం అనుకొని ఇప్పుడున్నాయనను నిలబెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి కానుక ఇద్దామని పిలుపునిచ్చారు. 

ALSO READ : ప్రపంచ అద్భుత రెస్టారెంట్లలో హైదరాబాద్ కు చోటు

కేసీఆర్ అటు.. మధిర ఎంపీపీ ఇటు..

ముదిగొండ, వెలుగు : మధిరలో సీఎం ఆశీర్వాద మహాసభకు వచ్చి పోగానే మధిర ఎంపీపీ దంపతులు మండెం లలిత, వెంకన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల పరిధిలోని పెద్దమండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో వారు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఎంపీపీ దంపతులు మాట్లాడుతూ బీర్ఎస్​లో అవమానాల తప్ప మరేమీ ఉండవన్నారు. మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలని చెప్పారు.