ఢిల్లీలో నేరాలు పెరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నట్లు?

ఢిల్లీలో నేరాలు పెరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నట్లు?
  • కేంద్ర హోంశాఖ, ఎల్జీపై కేజ్రీవాల్ ఫైర్ 
  • కేబినెట్ భేటీలో చర్చిద్దామని ఎల్జీకి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, నేరాల నియంత్రణలో కేంద్ర హోంశాఖ, ఎల్జీ విఫలమయ్యారని విమర్శించారు. దీనిపై చర్చించి నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్జీతో కలిసి కేబినెట్ మీటింగ్​లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మేరకు ఎల్జీ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ లెటర్ రాశారు.

‘‘ఢిల్లీలో గత 24 గంటల్లో నాలుగు మర్డర్లు జరిగాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న నేరాలతో ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, 2 కోట్ల మందికి పైగా ప్రజల ప్రతినిధిగా ఢిల్లీ భద్రత కోసం అన్ని విధాల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి” అని అందులో విజ్ఞప్తి చేశారు. 

ఎన్సీబీ హెచ్చరించినా పట్టించుకోలే.. 

ఢిల్లీలో మహిళలపై నేరాలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీబీ) రిపోర్టులో తేలిందని కేజ్రీవాల్ చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా 19 మెట్రోపాలిటన్ సిటీల్లో మహిళలపై జరుగుతున్న నేరాల్లో 32.2 శాతం ఢిల్లీలోనే ఉన్నాయని ఎన్సీబీ ఇటీవల పేర్కొంది. అయినప్పటికీ కేంద్ర హోంశాఖ గానీ, మీరు గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేరాలపై ఎన్సీబీ ముందే హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు” అని ఎల్జీకి రాసిన లెటర్ లో పేర్కొన్నారు.

‘‘ఢిల్లీలో పోలీస్ సిబ్బంది కూడా సరిపడా లేరు. ప్రజలు తమ భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటున్నారు. పోలీస్ సిబ్బందిని నియమించి, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటిపై కేబినెట్ లో మీతో కలిసి చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని సీఎం కేజ్రీవాల్​ చెప్పారు.