రేవంత్​కు క్రేజ్​.. కాంగ్రెస్​ నేషనల్​ స్టార్​ క్యాంపెయినర్​గా సీఎం

రేవంత్​కు క్రేజ్​.. కాంగ్రెస్​ నేషనల్​ స్టార్​ క్యాంపెయినర్​గా సీఎం
  • ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం
  • నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం
  • తెలంగాణలోనూ రేవంత్​ టైమ్​ కోసం పట్టుబడ్తున్న అభ్యర్థులు
  • వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు, 15 రోడ్ షోలకు ప్లాన్

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్​రెడ్డికి దేశవ్యాప్తంగా క్రేజ్​ పెరుగుతోంది. ప్రత్యర్థులపై కౌంటర్లు, తనదైన శైలిలో సెటైర్లు ఇస్తున్న తీరు ఇతర రాష్ట్రాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే తర్వాత రేవంత్​ను కూడా ప్రచారానికి రావాలని సుమారు ఏడు రాష్ట్రాల పీసీసీలు, పలువురు కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్లు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి రేవంత్​రెడ్డి​ కేరళలో కాంగ్రెస్​ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్​అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్​కు రేవంతే ​రావాలని పట్టుబడ్తున్నారు. కనీసం ఒక్క బహిరంగ సభలోనైనా పాల్గొనాలని కోరుతున్నారు. అప్పుడే తమ గెలుపు ఈజీ అనే ఆలోచనలో అభ్యర్థులున్నారు. దీంతో వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు,15 రోడ్ షోలకు సీఎం రేవంత్​ సిద్ధమయ్యారు.

నేటి నుంచి కేరళలో ప్రచారం 

రేవంత్ బుధవారం నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రచారానికి వెళ్తున్నారు. రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్ నియోజకవర్గంతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బరిలో ఉన్న అలప్పుజ పార్లమెంట్ సెగ్మెంట్లో  బుధ, గురు వారాల్లో ప్రచారంలో పాల్గొంటారు. పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో సీఎం రేవంత్​కు బిజీ షెడ్యూల్​ ఉండబోతోంది. కేరళ నుంచి రాగానే ఈ నెల 19, 21వ తేదీల్లో మహబూబ్ నగర్, మహబూబాబాద్, భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతారు. వచ్చే నెల 13న పోలింగ్ ఉండటంతో 11వ తేదీ వరకే ప్రచార గడువు ఉంది.  

ఆ లోపే మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో  సభలు, రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం చేయాలని రేవంత్ ప్లాన్ చేసుకున్నారు. ఓ వైపు రాహుల్, ప్రియాంక సభలు, రోడ్ షోలకు ప్లాన్​ చేస్తూనే  తాను ఒక్కో నియోజకవర్గం పరిధిలో కనీసం మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్​ రెడీ అయింది. ఈ లెక్కన  వచ్చే నెల 11వతేదీ కల్లా కనీసం 50 కి పైగా సభల్లో  పాల్గొనాలని రేవంత్​ భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ సిటీతో పాటు సికింద్రాబాద్, గ్రేటర్ ను ఆనుకొని ఉన్న చేవెళ్ల, మల్కాజ్​గిరి, భువనగిరి పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభలకంటే రోడ్ షోలకే రేవంత్ మొగ్గు చూపిస్తున్నారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో 3 నుంచి 4 రోడ్ షోలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని ప్రకారం రేవంత్ రెడ్డి 15 నుంచి 20 రోడ్ షోలలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏడు రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం 

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్​కు ఇప్పటికే  ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ పీసీసీల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు ఆయన​ షెడ్యూల్​ కూడా ఖరారైంది.  తాజాగా, తమిళనాడుతోపాటు గుజరాత్, బిహార్ పీసీసీల చీఫ్​ల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు సీఎంవో  ధ్రువీకరించింది. ఆయా రాష్ట్రాల పీసీసీలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా​ ప్రచారానికి రావాలని రేవంత్​ను రిక్వెస్ట్​ చేస్తున్నట్టు తెలిసింది.