తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేషవాహన సేవలో సీఎం చంద్రబాబు..

తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేషవాహన సేవలో సీఎం చంద్రబాబు..

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా  ప్రారంభమయ్యాయి.. బుధవారం ( సెప్టెంబర్ 24 ) సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగురవేశారు. ఆలయంలోని ధ్వజస్తంభానికి గరుడ ధ్వజపటాన్ని అధిష్ఠింపజేసి నలుదిక్కుల నుంచి సకల దేవతలను ఆహ్వానించారు. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు తిరుచ్చిలో ఉత్సవర్లతో పాటు అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి, ధ్వజపటాన్ని మాడవీధుల్లో ఊరేగించి ఆలయానికి వచ్చారు. అనంతరం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి. వేంకటాచల క్షేత్రంపై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి.

బుధవారం తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో చంద్రబాబు శ్రీవారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించడం విశేషం.అర్చకులు పరివట్టం చుట్టగా తలపై వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉంచారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని వస్త్రాలను బహూకరించి స్వామివారిని దర్శించుకున్నారు చంద్రబాబు. అనంతరం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.