
కడపలో మహానాడు ప్రతినిధుల సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ అడ్రస్ గల్లంతు చేశామని.. ఈసారి కడప జిల్లా క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు. కడపలో 10 స్థానాలకు 7స్థానాల్లో గెలుపొంది సత్తా చాటామని.. ఇంకొంచెం కష్టపడితే.. క్లీన్ స్వీప్ ఖాయమని అన్నారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలే తన ఆయుధాలు అని... కార్యకర్తలతో ఆకాశమే సరిహద్దుగా అభివృద్ధి చేస్తామని అన్నారు చంద్రబాబు.
తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని.. వారి త్యాగాలకు శిరసు వంచి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. రాష్ట్రం ఫస్ట్ అనేది టీడీపీ సంకల్పం అని అన్నారు చంద్రబాబు.ఏ పార్టీలో చూసినా టీడీపీ యూనివర్సిటీలో చదివినవాళ్లే ఉన్నారని.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని టీడీపీ మార్చేసిందని అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, రూ. 2 కే కిలో బియ్యం, బీసీలకు రాజ్యాధికారం, సబ్సిడీ కరెంట్ వంటి పథకాలు టీడీపీ తెచ్చినవే అని అన్నారు చంద్రబాబు.
దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనన్ని సంక్షోభాలు టీడీపీ ఎదుర్కొందని.. టీడీపీ పని అయిపోయిందని చెప్పిన పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని అన్నారు. గత ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను వేదించిందని అన్నారు. అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని.. రాష్ట్రం ఫస్ట్ అనేది టీడీపీ సంకల్పమని అన్నారు. 2025 మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని.. కడప మహానాడు ఏపీ దశ, దిశ నిర్దేశిస్తుందని అన్నారు చంద్రబాబు.