ఇండియా - యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు..

ఇండియా - యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు..

గురువారం ( నవంబర్ 13 ) ఇండియ-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని.. మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని అన్నారు.అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని అన్నారు చంద్రబాబు. సబ్ సీ కేబుల్ కూడా విశాఖ నుంచే ఏర్పాటు అవుతోందని అన్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీని ప్రోత్సహించామని.. గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్, వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని.. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని... వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందని అన్నారు చంద్రబాబు. దీని కోసం ఏపీలో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించిందని... దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు చంద్రబాబు.

అంతే కాకుండా.. డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నామని అన్నారు. సివిల్ అప్లికేషన్లు, డిఫెన్సు రంగాల్లో వీటి తయారీ పెరగాలని... అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామని అన్నారు చంద్రబాబు.స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని... ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు చంద్రబాబు.ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగిందని... సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఏపీ బలంగా ఉందని అన్నారు చంద్రబాబు.

పోర్టు రవాణా రంగంలో ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని.. రైల్వే నెట్వర్క్ కూడా పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశంలోని వివిధ నగరాల్ని అనుసంధానం చేస్తోందని అన్నారు చంద్రబాబు.గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామని... కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు చంద్రబాబు.

గూగుల్ కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతోందని... వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చామని అన్నారు చంద్రబాబు. ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదని.. పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కార్ట్ ఆఫీసర్‌ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తామని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందని అన్నారు.

ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని అన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి సాటి లేదని అన్నారు.2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుందని.. అందులో ఏపీ ముందుంటుందని అన్నారు చంద్రబాబు.