సీఎం మాట మీద నిలబడరు

సీఎం మాట మీద నిలబడరు

నారాయణపేట, వెలుగు: ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో సీఎం కేసీఆర్ ఒక్కటన్నా నెరవేర్చలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రుణమాఫీ, సున్నా వడ్డీ రుణాలు, పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ మోసమేనని అన్నారు. ఆయన మాట మీద నిలబడరని విమర్శించారు. రైతులకు రూ.5 వేల రైతు బంధు ఇస్తూ, రూ.30 వేల లబ్ధి చేకూరే సబ్సిడీ పథకాలను బంద్ పెట్టారని ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణ లో కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి కుటుంబాలే బంగారుమయం అయ్యాయని.. రాష్ట్రమేమో అప్పుల కుప్పగా మారిందని అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా మద్దూర్, దామరగిద్ద మండలాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్.. దోపిడీ, దొంగల రాజ్యంగా మారిందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు పోలీసులను వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. 8 వేల మంది రైతులు చనిపోయినా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని మండిపడ్డారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్.. కేవలం ఎన్నికల సమయంలోనే బయటకు వస్తారని విమర్శించారు.  

ప్రతిపక్షాలు అమ్ముడుపోయినయ్.. 

రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయని షర్మిల ఆరోపించారు. సర్కార్ అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లాగా టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని విమర్శించారు. విభజన హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చలేదని బీజేపీపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గుడులు, బడుల కన్నా మద్యం షాపులే ఎక్కువ ఉన్నాయని.. మద్యం అమ్మితేనే రాష్ట్రం నడిచే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. కాగా, దామరగిద్ద మండల కేంద్రంలో షర్మిలను వీఆర్ఏలు కలిసి మద్దతు కోరారు.