ఇంట్లో వాళ్లకు ఉద్యోగాలివ్వడంపైనే సీఎంకు ధ్యాస

ఇంట్లో వాళ్లకు ఉద్యోగాలివ్వడంపైనే సీఎంకు ధ్యాస
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
  • ఇంట్లో వాళ్లకు ఉద్యోగాలివ్వడంపైనే సీఎంకు ధ్యాస
  • ఎంప్లాయీస్‌‌కు జీతాలివ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు
  • కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ‘పల్లె గోస-బీజేపీ భరోసా’ యాత్ర

కామారెడ్డి, పిట్లం, వెలుగు: సీఎం కేసీఆర్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ‘‘ఈ మధ్య దేశంలో సర్వే చేస్తే కేసీఆర్.. అవినీతిలో టాప్‌‌లో నిలిచారు. ఆయన పేరు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు కాదు. కమీషన్​రావు. కమీషన్లు తిని సొంత ఆస్తులు పెంచుకుంటున్నారు.” అని మండిపడ్డారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పిండు. 85 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అసెంబ్లీలో మాట ఇచ్చిండు. కానీ ఇప్పటిదాకా 18వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు” అని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కల్పించటం కన్నా.. సొంత ఇంట్లో వారికి ఉద్యోగాలు కల్పించటం ఎట్లా అనే ప్రయత్నాల్లోనే సీఎం కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. బీజేపీ చేపట్టిన ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా ఐదో  రోజు సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో యాత్ర సాగింది. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, కార్యకర్తలతో కలిసి బైకులపై ఆయా గ్రామాలకు వివేక్ వెళ్లారు. పార్టీ జెండాలు ఆవిష్కరించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా చోట్ల వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘‘రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని మరో శ్రీలంక పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఉద్యోగాలకు జీతాల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖజానా పూర్తిగా ఖాళీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కాదు.. మిషన్ భగీరథలో కూడా భారీ అవినీతి జరిగింది” అని ఆరోపించారు. 

ఐదుగురికే రూ.25 లక్షల జీతాలు

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని వివేక్ ఆరోపించారు. ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులకే నెలకు రూ.25 లక్షల జీతాలు వెళ్తున్నాయని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం మోటార్లు వరదలో మునిగిపోయాయన్నారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పాత ట్యాంకులకు రంగులు వేసి నీళ్లు సప్లయ్ చేస్తున్నారన్నారు. చాలా గ్రామాల్లో సరిగ్గా నీళ్లు రావట్లేదని, వచ్చినా  కలుషిత నీళ్లు వస్తున్నాయన్నారు.

వరదలో జనాలుంటే.. ఓటీటీలో సినిమాలు చూస్తున్న కేటీఆర్

ప్రజలు వరద నీటిలో మునిగి ఇబ్బందులు పడుతుంటే.. మంత్రి కేటీఆర్ మాత్రం ఓటీటీలో సినిమాలు చూస్తున్నారని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. అసలు కాలు ఫ్యాక్చర్ వాస్తవమో కాదో ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చినట్లే.. అవినీతి సీఎం కేసీఆర్‌‌‌‌ను గద్దె దింపేందుకు కలిసి రావాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డికి సూచించామన్నారు. పల్లె గోస- బీజేపీ భరోసా యాత్రకు ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నదని వివేక్ తెలిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తున్నారన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపోవటం, ఫించన్లు, రోడ్లు, మోరీల ప్రాబ్లమ్స్ వంటివి తమ దృష్టికి తీసుకుస్తున్నారన్నారు.