- జార్ఖండ్లో తేలిన ‘ఇండియా’ కూటమి సీట్ల పంపకం
- మొత్తం 81 అసెంబ్లీ సీట్లలో 11 ఆర్జేడీ, కమ్యూనిస్టులకు
రాంచీ:రాబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి కలిసి పోటీ చేస్తుందని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ కలిసి 70 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతాయని శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మిగిలిన 11 సీట్లలో కూటమి పక్షాలైన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్టులు పోటీ చేస్తాయని ఆయా పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ‘‘మేము ప్రస్తుతం సీట్ల పంపకానికి సంబంధించిన వివరాలలోకి వెళ్లలే. మా కూటమి భాగస్వామి ప్రస్తుతం ఇక్కడ లేరు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు, మేము సీట్ల సంఖ్య మరియు ఇతర వివరాలను ఖరారు చేస్తాము” అని సోరెన్ మీడియాతో చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేశాయి.
అయితే ఈసారి కాంగ్రెస్‌కు 27 లేదా 28 సీట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందని, బాగోదర్ సీటును కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్)కు, నిర్సాను మార్క్సిస్ట్ కోఆర్డినేషన్ కమిటీ (ఎంఎంసీ)కి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ జార్ఖండ్ సీటు షేరింగ్ వివరాలను శుక్రవారమే వెల్లడించిన సంగతి తెలిసిందే. బీజేపీ 68 సీట్లలో పోటీ చేయనుండగా, మిత్రపక్షాలు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 10, జేడీయూ రెండు స్థానాల్లో, ఎల్‌జేపీ ఛత్రా ఒక్క స్థానంలో పోటీ చేయనున్నాయి.