తెలంగాణలో ఒంటరిగానే పోటీ .. కాషాయ జెండా ఎగరేస్తం : సీఎం హిమంత్ బిస్వ శర్మ

తెలంగాణలో ఒంటరిగానే పోటీ ..   కాషాయ జెండా ఎగరేస్తం :  సీఎం హిమంత్ బిస్వ శర్మ

హైదరాబాద్​: దేశంలో ఒకే గ్యారెంట్ నడుస్తదని.. అది మోడీ గ్యారెంట్ మాత్రమేనని అసోం సీఎం హిమంత్ బిస్వ శర్మ  స్పష్టం చేశారు.  బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా నిర్మల్​ జిల్లా భైంసాలో జరిగిన సభలో అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడారు.  ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని‌ ప్రారంభించిన ఆయన మోదీకి తెలుగు బాషపై అమితమైన ప్రేమ ఉందన్నారు. పార్లమెంట్ మీటింగ్ లో  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడాలని మోదీ కోరారని తెలిపారు. 

కాంగ్రెస్ నేత పీవి నరసింహా రావుకు బీజేపీ భారత రత్న ఇచ్చిందని, కానీ కాంగ్రెస్‌ ఏనాడు పీవీని పట్టించుకోలదని మండిపడ్డారు.  అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , చత్తీస్‌గఢ్ గెలుపొందినా తెలంగాణలో సీట్లు ఓట్లు పెరగడమే తమకు ఆనందానిచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతదని ఆయన దీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు‌ అంటున్నారని, కానీ అది ఎన్నటికీ జరగదన్నారు. ‘ మా సత్తాతో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం.. మా బలం, మా బలగం, మా సత్తా చాటుతాం’ అని ఆయన ప్రకటించారు. 

తెలంగాణలో  రజాకార్​ రాజ్య అంతమే బీజేపీ సిద్దాంతమన్నారు.  తెలంగాణాలో ఆరు  గ్యారెంట్ లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్క పూర్తి‌ గ్యారంటీ కూడా పూర్తి‌ చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులను, పేదలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.  జూటా గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో గుణపాఠం తెలుపాలని పిలుపునిచ్చారు. జూటా మాటలు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావో చెప్పాలని రాహుల్ గాంధీని ప్రజలు నిలదీయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ జూటా మాటల మంత్రం పని చేయదని ఆయన ఎద్దేవా చేశారు.