బడ్జెట్ లో భారీ కోత.. కేంద్ర ఆర్థిక విధానాలే కారణమన్న సీఎం

బడ్జెట్ లో భారీ కోత.. కేంద్ర ఆర్థిక విధానాలే కారణమన్న సీఎం

2019-20 వార్షిక బడ్జెట్ : రూ.1,46,492.30 కోట్లు

రాష్ట్ర బడ్జెట్ లో భారీగా కోత విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని .. అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంది. రాష్ట్ర బడ్జెట్ 2019-20ని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మండలిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు.

రూ.లక్ష 46 వేల కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో భారీగా కోతకు.. దేశమంతటా ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితులే కారణమని చెప్పారు సీఎం. దేశంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అసెంబ్లీలో వివరించారు. ఐనప్పటికీ.. కేంద్రం, చాలా రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని చెప్పారు. కేంద్రం ఆర్థిక విధానాలతో రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు సీఎం.

“2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,82, 017 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదిత వ్యయంగా ఓట్ ఆన్ అకౌంట్ లో అంచనా వేసింది. కానీ దేశంలో గడిచిన 18 నెలలుగా అర్థిక మాంద్యం స్థిరంగా కొనసాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి బాగా పడిపోయింది. అన్ని ప్రధాన రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఆదాయాలు పడిపోయాయి. దేశ ఆర్థిక పరిస్థితి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. మారిన పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించాం” అని చెప్పారు సీఎం.

2019-20 వార్షిక బడ్జెట్ : రూ.1,46,492.30 కోట్లు

రెవెన్యూ వ్యయం : రూ.1,11,055.84 కోట్లు

మూలధన వ్యయం : రూ.17, 274.67 కోట్లు

మిగులు : రూ.2,044.08 కోట్లు

ఆర్థిక లోటు : రూ.24,081 కోట్లు

ఈ ఐడేండ్లలో ఇంత తక్కువ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి.