ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చెల్లింపులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చెల్లింపులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ(కరువు భత్యం)ల చెల్లింపులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ క్రమంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక జనవరి 2019 రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించగా.. దీని ద్వారా 2074 కోట్ల అదనపు భారం పడనుంది.

జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. ఇక మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 3802 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను GPS లో 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో జమ చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.