ఏపీలో ఒకేసారి 4 చోట్ల సిటీ,ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన జగన్

ఏపీలో ఒకేసారి 4 చోట్ల సిటీ,ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన జగన్
  • నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలు
  • క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌
  • శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధన ఆస్పత్రులలో సేవలు

అమరావతి: శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధన ఆస్పత్రులలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలను క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రులను మరింత  బలోపేతం చేస్తున్నామన్నారు. పేదలకు రుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని తెలిపారు.

రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎంఆర్‌ఐ సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్ధతిలో, టెక్నాలజీ అప్‌డేట్స్‌ లేకుండా ఉన్నాయని, 4 చోట్ల అస్సలు ఎలాంటి పరికరాలు, సదుపాయాలు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో 16 కొత్త టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకువస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బోధనాసుపత్రి, నర్సింగ్‌కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని సిఎం తెలిపారు. ఈ పరికరాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. నిర్వహణ వ్యయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చూసుకుంటుందన్నారు.

రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో, ఎప్పటికీ పనిచేసేలా ఈపరికరాలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఆస్పత్రులను జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.