వైయస్సార్‌ నేతన్న నేస్తం ఆర్ధిక సాయం విడుదల

వైయస్సార్‌ నేతన్న నేస్తం ఆర్ధిక సాయం విడుదల

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఇవాళ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే బటన్ నొక్కి సీఎం జగన్ ఈ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో లింక్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడారు. గతేడాది తన పుట్టినరోజు డిసెంబరు 21న వైఎస్సార్ నేతన్న నేస్తం’పథకాన్ని ప్రారంభించామని, రెండో విడత సాయాన్ని మళ్లీ అదే రోజున ఇద్దామనుకున్నా, కరోనా కష్టకాలంలో నేతన్నలు పడుతున్న కష్టం చూడలేక వారికి ముందుగానే సాయం విడుదల చేస్తున్నామని చెప్పారు. చేనేతలు, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్ ‌కు మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నామని, ఆ దిశలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ ఏర్పాటు చేస్తున్నామని‌ జగన్‌ ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరు 2న ఆ ప్లాట్ ‌ఫామ్‌ ప్రారంభం అవుతుందని, ఆ ప్రక్రియలో మూడు బ్రిడ్జిలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఒకటి సరుకులు, వస్తువుల నాణ్యత కాగా, రెండోది వాటి కొనుగోలు విధానం అని, ఇక మూడవది వాటికి పేమెంట్లు ఎలా అన్నది అని ఆయన చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు ఇలా అనేక విధాలుగా పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాలు చూస్తుంటే, వాటి పేర్లు నేనే మిస్సవుతానేమో  అంటూ సీఎం జగన్ చమత్కరించారు. కేవలం 13 నెలల వ్యవధిలోనే ఇవన్నీ చేయగలిగామంటే అది ఆ దేవుడి దయ, మీ అందరి ఆశీస్సుల వల్లేనని సీఎం జగన్  పేర్కొన్నారు.