
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆర్థికశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడటానికి అవసరమైన మార్గాలను అన్వేషించే దిశగా కొత్త సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్ధిక వనరులు పెంచుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన వ్యూహ రచన చేస్తున్నారు.
ఇప్పటికే వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులను బదిలీ చేసిన సీఎం జగన్, శాఖల వారీగా సమీక్షలు ప్రారంభించారు. పాఠశాల విద్యకు సంబంధించి ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న ఆయన రెండో రోజు రెవెన్యూ , ఫైనాన్స్ శాఖల సమీక్షలు జరిపారు. రాష్ట్రం ప్రస్తుతం అప్పుల్లో ఉన్నందున నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను సూచించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికారులు ఇచ్చిన నివేదకను పరిశీలించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలని చెప్పారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటి దశలవారీగా మద్యపాన నిషేధం. ప్రస్తుతం ఈ విషయంపై కూడా ఆయన కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని వారికి సూచించారు. మద్యనిషేధం అన్నదే ప్రధానం కాకుండా మద్యం సేవించాలన్న ఆలోచననుంచి ప్రజలను బయటకు తీసుకు వచ్చే విధంగా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులపై కూడా నివేదిక కావాలని కోరారు సీఎం. గ్రీన్ టాక్స్, వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరైన ఇసుక విధానం అమలు వంటి చర్యలు ద్వారా ఆదాయాన్ని పెంచే ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.