‘ప్రైవేటు’కు రైట్‌‌‌‌‌‌‌‌ రైట్‌‌‌‌‌‌‌‌: ఆర్టీసీ రూట్లపై సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం!

‘ప్రైవేటు’కు రైట్‌‌‌‌‌‌‌‌ రైట్‌‌‌‌‌‌‌‌: ఆర్టీసీ రూట్లపై సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం!

    ముందు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ మార్గాల్లో..

    ప్రైవేటు బస్సుల నియంత్రణ కోసం గైడ్​లైన్స్​ తయారీ మొదలు

    ఏటా ఎంత ఫీజు తీసుకోవాలన్నదానిపై పరిశీలన

    త్వరలోనే నోటిఫికేషన్.. ఫస్ట్ కమ్  ఫస్ట్  సర్వ్ కింద ఇచ్చే యోచన!

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు రూట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏయే రూట్లను అప్పగించొచ్చు, ఎంత ఫీజును వసూలు చేయొచ్చు, ఏ రూట్​ నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీంతోపాటు ప్రైవేటు బస్సుల నియంత్రణ కోసం విధి విధానాలు, టికెట్ చార్జీలపైనా కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల కింద ప్రగతిభవన్ లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ప్రైవేటు రూట్లపై సర్వే చేయాలని సీఎం కేసీఆర్​ రవాణా శాఖను ఆదేశించినట్టు తెలిసింది. ‘‘ఏ రూట్లను ప్రైవేటుకు ఇవ్వాలి, ఏ రూట్లలో ఎక్కువ ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. రూట్లను అమ్మితే వచ్చే ఆదాయం ఎంతో నివేదిక ఇవ్వండి’’ అని సూచించినట్టు సమాచారం. ఈ మేరకు రవాణా శాఖలోని సీనియర్ అధికారుల బృందం రూట్ల ప్రైవేటీకరణపై సర్వే మొదలుపెట్టిందని.. ఏ రూట్లలో ఎన్ని సర్వీసులు నడుస్తున్నాయి, ఏ రూట్లలో ఎక్కువ రద్దీ ఉందన్న వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది.

జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్​ రూట్లకు..

ప్రస్తుతం రాష్ట్రంలో స్టేజీ క్యారియర్ గా ఆర్టీసీ మాత్రమే బస్సులు నడుపుతోంది. కొన్ని రూట్లలో కాంట్రాక్ట్ క్యారియర్లుగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి రోజూ వెయ్యి బస్సులు హైదరాబాద్ కు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. ఒక్కో బస్సు రోజుకు రెండు ట్రిప్పులు వేస్తుంది. అంటే రోజూ రెండు వేల ట్రిప్పులు హైదరాబాద్ కు నడుస్తున్నాయి. ఇందులో వివిధ జిల్లాల కేంద్రాల నుంచి నిర్వహిస్తున్నవే 70 శాతానికిపైగా ఉంటాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంతోపాటు మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులో వందశాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. ముందుగా ఈ రూట్లను ప్రైవేటుకు అప్పగించే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. ఇప్పటికే కాంట్రాక్ట్  క్యారియర్  కింద నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లకు కొన్ని ప్రైవేటు సంస్థలు బస్ సర్వీసులు నిర్వహిస్తున్నాయి.

ఆ బస్సులు రవాణాశాఖ పరిధిలోకి..

ప్రైవేటు బస్సులను ఎవరి నియంత్రణలో ఉంచాలన్న దానిపైనా ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఆర్టీసీ నియంత్రణలో ఉంచాలా, లేక రవాణా శాఖ పర్యవేక్షణ కిందికి తేవాలా అనే ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్  ట్రాన్స్ పోర్టులో ఆర్టీసీ వాటా తగ్గిస్తుంటే.. ఆ సంస్థ నియంత్రణలో ప్రైవేటు బస్సులను ఉంచడం మంచిదికాని కొందరు అధికారులు చెప్తున్నారు. నేరుగా ప్రభుత్వ పరిధిలో ఉంటే నియంత్రణ సమర్థవంతంగా ఉంటుందని అంటున్నారు. రవాణా శాఖ సీనియర్ అధికారికి ప్రైవేటు బస్సుల పర్యవేక్షణ అప్పగించే చాన్స్​ ఉందని చెప్తున్నారు. ఒక్కో సీటుకు ప్రభుత్వానికి ఎంత చెల్లించాలి, బస్ చార్జీలు ఏ మేరకు ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయించేలా నిబంధనలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. ఇక ఒక్కో రూట్లో ఒకే సంస్థకు అవకాశం ఇవ్వాలా, లేక రెండు, మూడు సంస్థలకు అప్పగించాలా అనే దానిపైనా చర్చ జరుగుతోంది.

ఎవరు ముందొస్తే వాళ్లకే..

రూట్ల అప్పగింత కోసం ఓపెన్ టెండర్  విధానం పాటించాలా, లేక ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ఇవ్వాలా అన్న దానిపై సీఎం వద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. ఓపెన్  టెండర్ కు అవకాశం ఉంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని, మొదట వచ్చిన వారికి మొదట రూట్లను కేటాయించేందుకు సీఎం మొగ్గుచూపే అవకాశం ఉందని ఓ అధికారి చెప్తున్నారు.

ప్రైవేటుకు త్వరలో నోటిఫికేషన్

రూట్లను ప్రైవేటు వారికి అప్పజెప్పడంపై నవంబర్  తొలివారంలోగానీ, రెండో వారంలోగానీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రూట్ ను సొంతం చేసుకున్న సంస్థ బస్సుల్లో ఒక్కో సీటుకు ప్రభుత్వానికి ఏటా ఎంత చెల్లించాలి, ఎన్ని వాయిదాల్లో చెల్లించాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ‘రూట్లను ప్రైవేటుకు అప్పగించినా ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ చార్జీల కంటే ఎక్కువగా వసూలు చేయకూడదు, నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోడానికి అనుమతి ఉండదు, నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే ఆ రూట్ ను రద్దు చేయడమో, ఫైన్ విధించడమో జరుగుతుంది’ అని అధికారవర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి