మేం పిలువలే.. వాళ్లే వచ్చిన్రు

మేం పిలువలే.. వాళ్లే వచ్చిన్రు
  • రూల్స్​  ప్రకారమే మా పార్టీలో కలిసిన్రు
  • మీకు జరిగింది అన్యాయమే.. మేమేం జేస్తమండి
  • మీ వాళ్లను మీరు కాపాడుకోకుండా మా మీద పడి ఏడుస్తరేంది?
  • కాంగ్రెస్​ ఎమ్మెల్యేల చేరికపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్

దేశవ్యాప్తంగా మీ పార్టీ(కాంగ్రెస్​) వాళ్ల మీద మీ ఆకర్షణ తక్కువైపోయి.. మిమ్మల్ని వదిలిపెట్టి బయటికి వస్తున్నరు. దీనికి మమ్ముల్ని నిందిస్తరెందుకండి. మీకు మీరు కంట్రోల్​ చేసుకోవాలి తప్ప.. ఇతరుల మీద పడి ఏడ్వడం కరెక్టు కాదు. మీరే కాపాడుకోవాలె. మీకు ఆకర్షణే ఉంటే, మీకు నాయకత్వ పటిమే ఉంటే వాళ్లు మిమ్మల్ని ఎందుకు వదులుతరండి. నాకు అర్థం కాదిది. ఏదో పే… ద్ద క్రైమ్​ జరిగినట్లు, రాజ్యాంగ వ్యతిరేకత జరిగినట్లు మాట్లాడుతరేంది? మాటి మాటికి అదే అంటున్నరు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తున్నది. మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే.. మేమేం జేయాల దానికి?.– సీఎం కేసీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు: రాజ్యాంగ నిబంధనలకు లోబడే టీఆర్​ఎస్​ ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిందని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. రెండోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరుతామని వచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిందిపోయి తమ మీద పడి ఏడవటం ఏమిటని ప్రశ్నించారు. రెండురోజుల అసెంబ్లీ సమా వేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య ఫిరాయింపుల అంశంపై మాటలు నడిచాయి. ‘‘12 మంది కాంగ్రెస్‌‌ సభ్యుల్ని టీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలో చేర్చుకున్నారు. దురదృష్టవశాత్తు ఎవరు ఏ పార్టీలో నుంచి గెలిచొచ్చినా, టీఆర్‌‌‌‌ఎస్‌‌లో కలుపుకునే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి” అని భట్టి అన్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం దేశానికి రోల్‌‌ మోడల్‌‌గా ఉండాలి కానీ.. ఇదేందని ప్రశ్నించారు. తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా భట్టి ఇదే అంశాన్ని లేవనెత్తారు.

దీనికి సీఎం కేసీఆర్​ బదులిస్తూ.. ‘‘మీకు జరిగింది అన్యాయమే. దానికి మేమేం జేయాలండి’’ అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తాము ఎవరినీ పార్టీలో చేర్చుకోలేదని, నిబంధనల ప్రకారమే జరిగిపోయిందన్నారు. ‘‘భట్టి విక్రమార్క వారి ఆక్రోశాన్ని చెప్తావున్నారు. కచ్చితంగా దేశానికి తెలంగాణ రోల్‌‌ మోడల్‌‌గా ఉంటది. ఎవరికీ సందేహం అక్కర్లేదు” అని సీఎం పేర్కొన్నారు. సభ్యులు పార్టీ మారడంపై వారికి వారే జవాబు చెప్పుకోవాలని, రాజ్యాంగ నిబంధనలకు లోబడి వాళ్లు టీఆర్​ఎస్​లోకి వచ్చారని తెలిపారు. ‘‘వాస్తవానికి రెండోసారి మేం గెలిచినాక టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరతామని కొంతమంది సభ్యులు వచ్చారు. మాకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది.. ఇప్పుడంత అవసరం లేదని వాళ్లకు స్పష్టంజేసినం. కానీ, రాజ్యాంగ నిబంధన ప్రకారం మూడింట రెండొంతుల మంది చీలిపోయి, విలీనం అయ్యారు. స్పీకర్‌‌‌‌ బులెటిన్ విడుదల చేశారు” అని వివరించారు. ‘‘ఏపీలో టీడీపీ రాజ్య సభ సభ్యులు, గోవాలో కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమయ్యారు. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ వాళ్ల మీద సొంత నాయకుల ఆకర్షణ తగ్గిపోయింది. వాళ్ల సభ్యులను వాళ్లు కాపాడు కోకుండా, మా మీద పడి ఏడుస్తారేంది. ఏదో  పెద్ద క్రైమ్ జరిగినట్టు” అని అన్నారు.

‘‘ఈ దేశంలో ఎవరైనా టు థర్డ్ మెంబర్స్‌‌ స్ప్లిట్ అయి వస్తే జాయిన్ చేసుకోరా?  విలీనం చేసుకోరా?” అని కేసీఆర్​ ప్రశ్నించారు. దీనికి ప్రతిగా భట్టి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్​ మైక్​ ఇవ్వలేదు. దీంతో ‘‘సభ మీరే నడుపుకోండి” అంటూ భట్టి సహా, కాంగ్రెస్‌‌ సభ్యులు వాకౌట్ చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతోనే ఆ 12 మంది

టీఆర్‌ఎస్‌ ఎల్పీలో విలీనమైన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటే సీట్లు కేటాయించారు. భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడి స్థానంలో, ఆయన పక్కన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కూర్చున్నారు. ఎడమ వైపు నుంచి రెండో వరుస ముందు సీట్లలో ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ కూర్చున్నారు. అధికార పక్షం వైపు సీట్లు ఎమ్మెల్యేలతో కళకళలాడగా, ప్రతిపక్షం వైపు సీట్లన్నీ పలుచగా కనిపించాయి. కాంగ్రెస్‌ పక్షాన ఆరుగురు ఎమ్మెల్యేలుండగా, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీకి చర్చలో మొదట పాల్గొనే అవకాశం ఇచ్చారు.

గంటన్నరకే సభ వాయిదా

శాసనసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం వరకు చర్చ నడుస్తుందని అంతా భావించారు. మూడు బిల్లులకు ఆమోదం, సంతాప తీర్మానం, మున్సిపల్‌ చట్టం ప్రవేశపెట్టిన అనంతరం ఎజెండాలో చేర్చిన మరో రెండు బిల్లులను సభలో ప్రవేశపెడుతారని అనుకున్నా, మధ్యాహ్నం 12.30 గంటలకే సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో సభలో చర్చిద్దామని అనుకున్న ఎమ్మెల్యేలు నిరాశగా బయటకు వచ్చేశారు.

మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

  • మెడికల్‌ ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లకు పెంపు
  • రుణ విమోచన కమిషన్‌ ఏర్పాటు
  • పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్