కేసీఆర్ దత్తత తీసుకొని రెండేండ్లు.. కనిపించని అభివృద్ధి

కేసీఆర్ దత్తత తీసుకొని రెండేండ్లు.. కనిపించని అభివృద్ధి
  • ఇండ్లు కట్టిస్త లేరు.. కట్టుకుంటమంటే పర్మిషన్‌‌ ఇస్తలేరు

  • అవే ఇరుకు రోడ్లు.. పెంకుటిండ్లు.. పంచాయతీకి పైసా ఇయ్యలే 

  • సిబ్బందికి జీతాలు చెల్లిస్తలే.. కొత్తగా ఒక్కపనీ చేయలే

యాదాద్రి, వెలుగు: సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని దత్తత తీసుకొని రెండేండ్లు అవుతున్నా ఊరి పరిస్థితి ఏమీ మారలేదు. కొత్తగా ఇండ్లు కట్టివ్వక పోగా, సొంతంగా కట్టుకుంటామన్న వాళ్లకు పర్మిషన్​ కూడా ఇస్తలేరు.  2020 నవంబర్ 1న గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటన చేసిన తర్వాత వాసాలమర్రికి స్పెషల్​ఆఫీసర్​ను నియమించి నెల రోజుల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. డిపార్ట్​మెంట్ల వారీగా జిల్లా ఆఫీసర్లు రంగంలోకి దిగి గ్రామంలో ఉన్న ఇండ్లు, వయసుల వారీగా జనాభా, రైతులు, రైతు కూలీలు, ఉపాధి, కుల, మతాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. ప్రజలు ఏమడిగారో.. రిపోర్టుల్లో పేర్కొన్న ఆఫీసర్లు వీటిని సమకూర్చడానికి ఎంత ఖర్చువుతుందో లెక్కలు వేశారు. 

కేసీఆర్​ సూచనల మేరకు రెండుసార్ల డీపీఆర్ తయారు చేశారు. నిజామాబాద్​లోని అంకాపూర్​కు గ్రామస్తులను రెండుసార్ల తీసుకెళ్లారు. నాలుగుసార్లు వచ్చిన సీఎం వాసాలమర్రి మీదుగా ఎర్రవెళ్లికి పలుమార్లు వెళ్లిన సీఎం కేసీఆర్ గ్రామంలో నాలుగుసార్లు ఆగారు. 2020 అక్టోబర్ 31న వాసాలమర్రిలో మొదటిసారి ఆగిన సీఎం, నవంబర్1న దత్తత తీసుకుంటానని ప్రకటించారు. 2021 జూన్ 22న వాసాలమర్రికి వచ్చిన ఆయన రకరకాల వంటలతో గ్రామస్తులందరికీ దావత్ ఇచ్చారు. సీఎంగా నేనే మీ చేతుల్లో ఉన్నా.. ఇక అన్ని జరుగుతాయని కానీ మీరే పట్టుపట్టాలని ఆనాడు సూచించారు.

మీ వెనుక ప్రభుత్వం ఉంటుందని ప్రకటించారు. మీరందరూ కలిసికట్టుగా పని చేసి.. బంగారు వాసాలమర్రి సాధించుకోవాలని సూచించారు. 2021 ఆగస్టు 4న మరోసారి వచ్చిన సీఎం కేసీఆర్​ దళితవాడల్లో పర్యటించారు. ఊరంతా పర్యటించి అందరినీ పలకరిస్తూ తిరిగారు. తర్వాత వాసాలమర్రిలో దళితబంధు అమలు చేస్తానని ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి సాగు భూమి అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఫామ్ హౌస్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తూ మరోసారి ఆగారు.

ఆఫీసర్లందరు వచ్చిపోయిన్రు

కేసీఆర్ ప్రకటన తర్వాత వాసాలమర్రికి చాలా మంది ఆఫీసర్లు వచ్చి వెళ్లారు. ఈ ఏడాది జనవరిలో సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎస్సీ డెవలప్​మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ గీత పర్యటించారు. మే నెలలో యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. రూ.155 కోట్లతో ఆఫీసర్లు రూపొందించిన డీపీఆర్ సీఎం పేషికి చేరింది. ఊరిలో కొత్తగా నిర్మించుకున్న ఇండ్లు కాకుండా మరో 570 ఇండ్లు నిర్మించాలని డీపీఆర్​లో పేర్కొన్నారు. గ్రామంలో సెంట్రల్ ​లైటింగ్​, సీసీ రోడ్లు, అంగన్​వాడీ సెంటర్లు, స్కూల్​ బిల్డింగ్స్, పంచాయతీ బిల్డింగ్ కొత్తగా అండర్ గ్రౌండ్​డ్రైనేజ్, చెరువులను పునరుద్ధరించి, టూరిస్ట్ సెంటర్లుగా డెవలప్ చేయాలని పేర్కొన్నారు.

దళితబంధు మాత్రమే..

ఇప్పటి దాక గ్రామంలో ఉన్న 75 దళిత కుటుంబాలకు మాత్రమే దళితబంధు స్కీం అమలైంది. కొందరికి రేషన్​కార్డులు ఇచ్చారు. అంతేతప్ప 2020 నవంబర్​ 1న వాసాలమర్రి ఎట్లుందో ఇప్పుడూ అట్లనే ఉంది. ఎలాంటి డెవలప్​మెంట్ జరగలేదు. అవే ఇరుకు రోడ్లు, పెంకుటిండ్లు. ఇప్పటికే కూలిన పాత ఇండ్లు. కూలాడినికి సిద్ధంగా ఉన్న ఇండ్లూ ఉన్నాయి. ఇండ్లు పాతగవడంతో కొంతమంది కొత్తగా కట్టుకుంటామని గ్రామ పంచాయతీ పర్మిషన్ అడిగితే ఇయ్యడం లేదు. కేసీఆర్ దత్తత తీసుకున్నందున ఆయనే ఇండ్లు కట్టిస్తరు... కలెక్టర్ పర్మిషన్ ఇయ్యొద్దన్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఇండ్లు కట్టిస్తలేరు.. ఇల్లు కట్టుకుందామంటే పంచాయతీ పర్మిషన్​ ఇస్తలేరు. దీంతో కూలిపోయిన ఇండ్లలోనే కొందరు నివాసం ఉంటున్నారు. సర్పంచ్ పోగుల ఆంజనేయులు ఇల్లు కూడా కూలిపోయే స్థితిలో ఉంది. ఇంటిపైన కవర్ కప్పి ఉంటున్నరు.

బిల్లులు వస్తలేవు.. అక్టోబర్​ జీతాలు రాలే

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు నవంబర్​ 1, 2 తేదీల్లో జీతాలు పడ్డాయి. కానీ వాసాలమర్రి పంచాయతీ స్టాఫ్​కు ఇప్పటివరకూ జీతాలు రాలే. గ్రామానికి కొత్తగా ఫండ్​ రావడం లేదు. పంచాయతీకి వచ్చే ఫండ్​ కరెంట్​ బిల్లు, జీతాలకే సరిపోతున్నది. పంచాయతీ ట్రాక్టర్​కు డీజిల్​ పోయించేందుకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. పోయే ఇండ్లకు పన్ను ఎందుకు కట్టాలంటూ ఎవరూ ఇంటిపన్నూ కట్టడం లేదు. ఈసారి అతికష్టం మీద 15 శాతం వసూలైంది. పోయినేడాది దసరా, ఈ ఏడాది సంక్రాంతి, దసరాకు వేయించిన లైట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి.

బోరు మోటారు రిపేర్లు, పల్లె ప్రకృతి వనం బిల్లు, క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు కూడా ఇంకా రిలీజ్ చేయలే. ఊర్లో పైపులైన్లు తరచూ పగిలిపోతున్నాయి. ఎన్ని సార్లు  రిపేర్​చేయించినా పరిస్థితి మారట్లేదు. స్పెషల్ డెవలప్​మెండ్ ఫండ్​ కింద రూ.25 లక్షలు వాసాలమర్రికి మంజూరయ్యాయి. ఈ ఫండ్​ను గ్రామంలో ఖర్చు చేయవద్దని చెప్పినట్టు సమాచారం. దీంతో రూ.15 లక్షలతో కొండపూర్ రోడ్డు నుంచి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి టెంపుల్​కు మెటల్ రోడ్డు, కొండాపూర్ రోడ్డు నుంచే మధిర గ్రామమైన రాంచిట్టిపల్లికి సీసీ రోడ్డు రూ.10 లక్షలతో ప్రతిపాదన పెట్టారు.

కలెక్టర్​  కలవలే

ఇంటి పర్మిషన్లు ఇవ్వాలని పంచాయతీకి రోజూ కొందరు వస్తుండడంతో కలెక్టర్​ పమేలా సత్పతిని కలవడానికి వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు కలెక్టరేట్​లో ఇటీవల  నిర్వహించిన ప్రజావాణికి వచ్చాడు. అయితే, ఆ రోజు కలెక్టర్​ పమేలా సత్పతి రాకపోవడంతో సర్పంచ్​ చాలాసేపు ఎదురు చూసి వెళ్లిపోయారు. 

కేసీఆర్ వస్తే సంబురపడ్డం

గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకుంటే సంబురపడ్డం. అడగకున్నా దావతిచ్చిండు. ఊరుకొచ్చి ఎన్నో చెప్పిండు. అన్ని ఇస్తనన్నడు. ఊరు పేరు దేశమంతా పాకింది. ఎంతో ఆశపడ్డము. రేకుల ఇంటి కాడ పెద్దిల్లు వస్తదని అనుకున్నా. రెండేండ్లాయే ఏమీ ఇయ్యలేదు. - హాజిపురం రాములు, వాసాలమర్రి

ఇంటి జాగకూడా లేదు

మాకు కొంత జాగే ఉండే. అన్నదమ్ముల పంచాయితీ పుట్టి.. ఒకళ్లకు ఇచ్చేసిన. కిరాయికి ఉంటున్నం. ఊరును దత్తత తీసుకున్న కేసీఆర్ ఇండ్లిస్తా అని చెప్తే. ఆశపడ్డం. ఇల్లు కట్టినంక ఉన్నొక్క బిడ్డ పెండ్లి చేద్దమని అనుకున్నం. ఇప్పటికీ ఇల్లు రాలే. - చెన్నరాజు కళమ్మ, వాసాలమర్రి

‘‘వాసాలమర్రిలో ఇండ్లు సక్కదనంగా లేవు. అన్ని మట్టిగోడల ఇండ్లే ఉన్నయ్​. కొన్నిండ్లు కూలిపోయినయ్​. ఊరంతా ఎత్తులు.. ఒంపులు ఉన్నయ్​. వానపడితే నీళ్లు ఇండ్లళ్లకు వస్తున్నయ్​. మీరందరూ ఒప్పుకుంటే ఎర్రవల్లి లెక్క ఊరు మొత్తం కూలగొడ్దాం. అందరికీ ఒకేరీతిగా ఇండ్లు కట్టేదాక టెంట్ల కిందే ఉందాం. మీరు ఒప్పుకుంటే ఆరేడు నెలల్లో బ్రహ్మాండంగా చేసుకుందాం’’- వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ (2021 ఆగస్టు 4)

ఇల్లు పాడుబడ్డదని కూలగొట్టిన. కొత్తిల్లు కట్టుకుందామంటే కేసీఆర్ కట్టిత్తడని పర్మిషన్ ఇస్తలే. మా అన్న ఇంట్ల (ఒక్క రూం) ఉంటున్న. భార్య, ఇద్దరు పిల్లలు పడుకుంటే నాకు పండుకోవడానికి జాగే ఉండది. ఎట్లనో అట్ల ఉంటున్నం. బిడ్డ పెండ్లి పెట్టుకుందామనుకుంటే. ఇల్లు చూస్తే ఇట్లుండే. కొత్తిల్లు కట్టి పెండ్లి చేద్దామనుకుంటే.. పర్మిషన్ కోసం అడిగి అడిగి యాష్టకొస్తుంది. ఈ కూలిపోయే ఇంట్ల పదిమంది చుట్టపోళ్లు ఎట్ల చేయి కడుగుతరు. పెండ్లి అయినంక అల్లుడు ఇంటికొస్తే ఏడుంటడు. బిడ్డ పెండ్లిపై మా ఇంటామె రంది పెట్టుకుంది. - ఎరుకల భిక్షపతి గౌడ్, వాసాలమర్రి