మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి ​: కేసీఆర్

మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి ​: కేసీఆర్
  • అగ్నిపథ్​ రద్దు చేస్తం.. పాత పద్ధతినే తెస్తం
  • విశాఖ ఉక్కును పబ్లిక్​ సెక్టార్​లో పెడ్తం
  • మహిళలకు చట్టసభల్లో 35% రిజర్వేషన్లు ఇస్తం
  • కాంగ్రెస్​, బీజేపీ వల్లే నీటి యుద్ధాలు..
  • బ్రిజేష్ ​ట్రిబ్యునల్​ జడ్జి ఎప్పుడు హరీ అంటడో..
  • ప్రతిపక్షాలను కేంద్రం వేధిస్తున్నదని ఆరోపణ
  • ఖమ్మంలో బీఆర్​ఎస్​ బహిరంగ సభ
  • హాజరైన విజయన్​, కేజ్రీవాల్​, మాన్​, అఖిలేశ్


ఖమ్మం,​ వెలుగు: బీఆర్ఎస్​ లాంటి భావజాలం ఉన్న పార్టీలు దేశంలో అధికారంలోకి వస్తే రెండేండ్లలో తెలంగాణలాగా వెలుగు జిలుగుల భారతదేశాన్ని తయారుచేస్తామని బీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రశ్నించడానికి,  చైతన్యం తీసుకురావడానికే బీఆర్ఎస్​ వచ్చిందని, దేశ ప్రజల దాహం తీర్చి.. సాగు భూములు తడుపుతామని చెప్పారు. రైతు బంధు, దళిత బంధు, ఉచిత కరెంట్​ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. అగ్నిపథ్ ను రద్దు చేస్తామని కేసీఆర్​ తెలిపారు. బుధవారం ఖమ్మంలో బీఆర్​ఎస్​ బహిరంగ సభ జరిగింది. కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​ యాదవ్​, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు హాజరయ్యారు. సభలో కేసీఆర్​ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే.  కాంగ్రెస్​ అధికారంలో ఉంటే బీజేపీని తిట్టడం.. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్​ను తిట్టడం పనిగా పెట్టుకున్నయ్​. ఈ తిట్ల పురాణం కాదు. మన గొంతులు తడవడానికి, మన పొలాలు తడవడానికి, పంటలు పండడానికి బీఆర్ఎస్​ను తీసుకొచ్చినం” అని అన్నారు.


కరెంట్​ కార్మికులు, ఎల్​ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు, మహిళలు, దళిత జాతి అందరూ ముందుకు వచ్చి బీఆర్ఎస్​ను బలపర్చాలని కోరారు. సీపీఎం, సీపీఐ సహా ప్రగతిశీల పార్టీలతో బీఆర్​ఎస్​ కలిసి దేశవ్యాప్తంగా పనిచేస్తుందని, బ్రహ్మండంగా ముందుకు పురోగమిస్తామని చెప్పారు. ‘‘అంతిమ విజయం మనదే మనదే మనదే.. న్యాయం, ధర్మం ఎప్పడూ గెలిచి తీరుతాయి” అని అన్నారు. 

మా పాలసీ కోసం వంద మంది పనిచేస్తున్నరు

‘‘నేను ఎక్కువ టైం తీసుకోను. నాలుగే నాలుగు విషయాలు. రాబోయే రోజుల్లో డిటెయిల్​ డాక్యుమెంట్లలో బీఆర్​ఎస్​ జాతీయ పాలసీ చెప్తం. కొద్ది రోజులోనే బీఆర్​ఎస్​ టోటల్​ పాలసీ బ్రహ్మాండంగా ప్రజల ముందు పెడుతాం. దానిమీద రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారులు, సుప్రీంకోర్టు  మాజీ జడ్జిలు ఒక వంద, 50 మంది పనిచేస్తా ఉన్నరు. డ్రాప్టింగ్​ జరుగుతున్నది. అవన్నీ త్వరలోనే దేశం ముందు పెడుతాం. చర్చకు పెడుతాం” అని కేసీఆర్​ తెలిపారు. ‘‘ఒకటే ఒక మాట నా మనస్సును అనేక రోజులుగా కలచివేస్తున్నది. చాలా బాధపెడుతున్నది. ఈ రోజు భారతదేశ సమాజం  లక్ష్యం ఏమిటి ? ఏదన్నా ఉందా లక్ష్యం? భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా ? దారి తప్పిందా ? బిత్తరపోయి గత్తరపడుతుందా ? ఏం జరుగుతున్నది అనేది నా అంతరాత్మను కలచివేస్తున్నది. ఎవరినీ అడుక్కునే అవసరం లేనటువంటి.. ఏ ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకునే అవసరం లేనటువంటి.. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు.. అదంతా ఏమైతా ఉంది? ఇంత ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలి?” అని ప్రశ్నించారు.  

బ్రిజేష్​ ట్రిబ్యునల్​ జడ్జి ఎప్పుడు హరి అంటడో..  

‘‘స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో వేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్ప తర్వాత అతీగతీ లేదు. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదం మీద బ్రిజేష్​ కుమార్​ ట్రిబ్యునల్​ వేసిన్రు. అది వేసి 19 ఏండ్లు గడిచిపోయింది. ఆ జడ్జి ముసలివాడు.  ఆయనను నలుగురు తీసుకువచ్చి కుర్చీలో కుసోవెడ్తరు. ఆయన ఎప్పుడు హరి అంటాడో ఎవనికీ తెల్వదు. 20 ఏండ్లు దాటుతుంటే.. ట్రిబ్యునల్​ ఉలుకు పలుకు లేకపోతే.. ఆయన తీర్పు చెప్పేది ఎప్పుడు ?  ప్రజలకు తాగునీళ్లు, సాగునీళ్లు వచ్చేది ఎప్పుడు ?” అని కేసీఆర్​ ప్రశ్నించారు. ఆరు నూరైనా సరే తెలంగాణ ఉద్యమం లాంటిది దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలని తెలిపారు. దేశంలో రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలకు కాంగ్రెస్​, బీజేపీ ప్రభుత్వాలే కారణమని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘ఇయ్యాల మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా ? పాలమూరు అయితలేదా ? ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పరుగులు పెడతలేదా? సంకల్పం ఉంటే.. అన్నీ సాధ్యమే” అని అన్నారు. 

భగీరథతో దూప తీర్చుకున్నం

మిషన్​ భగీరథతో తెలంగాణలో దూప తీర్చుకున్నామని కేసీఆర్​ చెప్పారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి మంచినీళ్లు కూడా ఇవ్వరాదా? ఇంత పెద్ద ప్రధాన మంత్రి.. ఇంత పొడుగు.. ఇంత దొడ్డు.. మంచినీళ్లు ఇచ్చే చాతకాదా ? గడబడ లొల్లి.. ఎందుకయ్యా నాకర్థం కాదు. పనికిమాలిన లొల్లి.. మంచినీళ్లు తే చాతకాదా ? మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే.. ఐదేండ్లలోపు దేశమంతా మిషన్ భగీరథలాగానే ప్రతి ఇంటికీ శుద్ధమైన మంచినీటిని అందిస్తం”అని అన్నారు. నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ, పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. ‘‘మన దగ్గర మేక్​ ఇన్​ ఇండియా జోక్​ ఇన్​ ఇండియా అయిపోయింది. పేటకొకటి పూటకొకటి చైనా బజార్లు ఉంటయి. ఇదేంది?” అనిప్రశ్నించారు. ‘‘అగ్నిఫథ్​ను కూడా రద్దు చేస్తాం. బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో పాతపద్ధతిలోనే కొనసాగిస్తం” అని తెలిపారు. దేశమంతా తెలంగాణలో ఇస్తున్నట్లుగా ఉచిత కరెంట్​ ఇచ్చి తీరాలని అన్నారు. ‘‘రేపు బీఆర్​ఎస్​ గవర్నమెంట్​.. బీఆర్​ఎస్​ ప్రతిపాదించే గవర్నమెంట్​ వస్తే భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగా తెలంగాణ మోడల్​లోనే ఉచిత కరెంట్​ సప్లై చేస్తం” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతున్నదని, సామాన్య ప్రజల మీద టాక్స్​లు వేస్తున్నదని దుయ్యబట్టారు. ‘‘2024లో మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి” అని ధీమా వ్యక్తం చేశారు. 

మా పాలసీ నేషనలైజేషన్​

చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మతవిద్వేషపు మంటలు రేపుతున్నరు. ప్రతిపక్షాలను వేధిస్తున్నరు. నేను సీదా చెప్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి. మీ పాలసీ ప్రైవేటైజేషన్.. మా పాలసీ నేషనలైజేషన్. ఇయ్యలా ఎల్​ఐసీని అమ్ముత అమ్ముత అంటున్నవ్​.  అమ్మేయ్.. పర్వాలేదు. 2024 తర్వాత నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి. గ్యారంటీగా మళ్లా ఎల్​ఐసీని వాపస్​ తీసుకుంటం. ఇయ్యాల మిషన్​ భగీరథతో తెలంగాణ దూపతీర్చుకున్నం. దేశంలో మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే.. ఐదేండ్లలోపు దేశమంతా ప్రతి ఇంటికీ బ్రహ్మాండంగా నల్లా పెట్టి శుద్ధమైన మంచినీటిని అందిస్తం. ఉజ్వలమైన భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసమే బీఆర్​ఎస్​ పుట్టింది. - కేసీఆర్​

ప్రతిపక్షాలను వేధిస్తున్నది

కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధిస్తున్నదని, చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మతవిద్వేషపు మంటలు రేపుతున్నదని కేసీఆర్​ ఆరో పించారు. ‘‘మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. అందరం ఏకమైతే ఈ మూర్ఖుల అసమర్థుల పాలనను తొలగించడం కష్టం కాదు.. ఒక ఉజ్వలమైన భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసమే బీఆర్​ఎస్​ ఆవిర్భావించింది” అన్నారు. ‘‘విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మోడీ అమ్మాలనుకుంటున్నరు.  పర్వాలేదు. నీ చేతిలో అధికారం ఉంది అమ్మేయ్​. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ తీసుకుని పబ్లిక్​ సెక్టార్​లో పెడుతాం. ఇది మా వాగ్దానం” అని అన్నారు.  సాగును కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తు న్నారని, కార్పొరేట్​ గద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘‘జ్ఞానం ఎక్కడ దొరికితే అక్క డ నుంచి స్వీకరించాలి. పొరుగునే ఉన్న చైనా.. ఏ విధంగా ఈ రోజు  ప్రపంచాన్ని శాసిస్తున్నది? 1980 వరకు మనకన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా, అణుబాంబు దెబ్బతిని తేరుకుని మళ్లీ కోలుకున్న జపాన్​ ఈ రోజు ప్రపంచంలో అద్భుతమైన మేటి దేశాలు వెలుగొందుతున్నయ్​. ఏమీ లేని సింగపూర్​ ఆర్థిక సౌష్టవంతో మన కండ్ల ముందు కనబడుతా ఉంది. దక్షిణ కొరియా కానీ.. మలేషియా కానీ ఇంకా ఎన్నో దేశాలు ఉదాహరణాలు ఉన్నాయి. అదే పద్ధతిలో మన దేశం కూడా ముందుకు పోవాలి” అని అన్నారు. 

విద్యుత్​ రంగాన్ని పబ్లిక్​ సెక్టార్​లోనే ఉంచుతం

‘‘దేశమంతా కూడా ఇయ్యాల కరెంట్​ కోతలు. అన్ని రాష్ట్రాల్లో ఇట్లనే ఉంది. ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా 24 గం టల కరెంట్​ ఇచ్చే పరిస్థితి లేదు” అని కేసీఆ ర్​ చెప్పారు. బీఆర్​ఎస్​ లాంటి భావజాల పార్టీలు అధికారంలోకి వస్తే రెండేండ్లలో తెలంగాణ లాంటి వెలుగు జిలుగుల భారత దేశాన్ని తయారు చేస్తామని తెలిపారు. ‘‘వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకుం టా ఉన్నరు ఈ దేశంలో. మనం సిగ్గు పడాలి. ఇన్ని సంపదలు.. ఇంత భూమి ఉన్న ఈ దేశంలో రైతులు తమ సమస్యల కోసం ఢిల్లీ రాజధానిలో ధర్నా చేసే దుస్థితా? ఇదేనా ఈ దేశాన్ని పరిపాలించే విధానం. దేశానికి కావాల్సింది ఇదేనా” అని ప్రశ్నించారు.  స్వాతంత్ర్య వచ్చిన నాటి నుంచి నేటిదాకా లక్షల కోట్ల రూపాయాల జెన్​కోలు, ట్రాన్స్​కోల ఆస్తులు మన కండ్ల ముందు  ఉన్నాయని, వాటిని అప్పన్నంగా లాస్​ ఏదో చూపించి షావుకార్లకు అప్ప గించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపిం చారు. కరెంట్​ రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్​ సెక్టార్​లోనే ఉంచుతామని, అదే బీఆర్​ఎస్​ పాలసీ అని చెప్పారు.

ఏడాదికి దేశంలో 25 లక్షల మందికి దళితబంధు ఇస్తం

‘‘దళిత జాతి బిడ్డలు ఎవల కోసం వివక్ష అనుభవించాలి ? ఎన్నేండ్లు అనుభవించాలి.. అందుకే తెలంగాణలో పుట్టింది దళితబంధు పథకం. అంబేద్కర్​ బాటలో.. కాన్షీరాం చూపెట్టిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. భారత దళిత జాతికి నేను పిలుపు ఇస్తా ఉన్న. తెలంగాణ దళితబంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశం మొత్తం అమలు చేయాలని బీఆర్​ఎస్​ డిమాండ్​ చేస్తా ఉంది’’ అని కేసీఆర్​ అన్నారు.