యాసంగి వడ్లన్నీ మేమే కొంటం

యాసంగి వడ్లన్నీ మేమే కొంటం
  • రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు మొదలైతయ్​: సీఎం 
  • వానాకాలం వడ్లతో పోలిస్తే యాసంగి వడ్లకు మూడున్నర వేల కోట్ల నష్టం వస్తది
  • దాన్ని భరించాలని డిమాండ్​ చేస్తూ కేంద్రంతో చివరి దాకా పోరాడినం
  • కేంద్రంలో ఉన్నది వెదవ, పనికిమాలిన గవర్నమెంట్​.. మతపిచ్చి లేపుతున్నది 
  • యూనివర్సిటీల్లో నియామకాల కోసం కామన్​ రిక్రూట్​మెంట్​ బోర్డు 
  • రాష్ట్రంలో కొత్తగా ఆరు ప్రైవేట్​ యూనివర్సిటీలు
  • మే 20 నుంచి జూన్​ 5 వరకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి
  • కేబినెట్​ భేటీ అనంతరం మీడియాతో కేసీఆర్​ 
  • గ్రూప్​1, గ్రూప్​2లకు ఇంటర్వ్యూలు ఎత్తివేత
  • పోలీస్​ ఉద్యోగాలకు వయోపరిమితి మూడేండ్లు పెంపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగిలో రైతులు పండించిన వడ్లన్నీ తామే కొంటామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. రైతులు ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఆయన సూచించారు. వడ్లకు నిర్ణయించిన ఎంఎస్పీ రూ.1,960 చెల్లించి కొంటామన్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌‌‌‌లో రాష్ట్ర కేబినెట్‌‌‌‌ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెండు మూడు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వానాకాలంలో క్వింటాల్‌‌‌‌ వడ్లను పట్టిస్తే 65 నుంచి 67 కేజీల బియ్యం వస్తాయని, యాసంగిలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నూక ఎక్కువ అవుతుందన్నారు. కేంద్రం నూక అయ్యే నష్టాన్ని భరించడానికి సిద్ధంగా లేదని, అది ఎంతయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి కొంటుందని తెలిపారు. ‘‘యాసంగి బియ్యంలో వచ్చే వ్యత్యాసం ఎంత ? మేం భరించాల్సి ఎంత? అనే దానిపై చీఫ్​ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినం” అని చెప్పారు.  ‘‘రైతులు ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్ముకోవద్దు. క్వింటాకు ఎంఎస్పీ రూ.1960 టంచన్‌‌‌‌గా చెల్లిస్తం. ఈ దిక్కుమాలిన కేంద్రం మనకు మొండిచేయి చూపించినంత మాత్రాన చిన్నబుచ్చుకునేది లేదు’’ అని అన్నారు. 

దుర్మార్గమైన కేంద్రం

యాసంగిలో వరి వేయొద్దని తాము ముందే చెప్పామని, ఇక్కడి బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని సీఎం మండిపడ్డారు. ‘‘దుర్మార్గమైన కేంద్రం ఉంది. సక్కదనం లేదు. వ్యవహారం సరిగ్గా లేదు. వెదవ, పనికిమాలిన ప్రభుత్వం. ఇతర పంటలు వేసుకొమ్మని మేం చెప్పినం.  దాదాపు 20 లక్షలుఎకరాల వరి పంట తగ్గించినం. ఆ టైంలో మేం కొంటం, కేంద్రమే కొంటదని ఇక్కడి బీజేపీ నేతలు వీరంగాలు ఎత్తి దుర్మార్గమైన దుష్ప్రచారం చేసిన్రు. కొందరు రైతులు వేరే వేసుకోలేక వరి వేసుకున్నరు’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం విషయంలో కేంద్రం వింత వాదన చేస్తున్నదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని తాను ఢిల్లీకి వెళ్లానని, రాష్ట్ర మంత్రులు వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారని తెలిపారు. ‘‘ధాన్యం కొనుమంటే మెడకు పెడితే కాళ్లకు.. కాళ్లకు పెడితే మెడకు పెట్టిన్రు. చాలా అవమానకరంగా మాట్లాడిన్రు. చీప్​గా, తెలివి తక్కువగా, ఏమైనా జ్ఞానం, బుద్ధి ఉందా లేదో అర్థం కాదు. నూకలు తినడం అలవాటు చేయండి అంటరా ? నేను పోయినప్పుడే కేంద్ర మంత్రి.. క్యా చమత్కార్​ కర్​ దియా భాయ్​ తెలంగాణ .. క్యా చమత్కార్​ హో గయా అని అన్నరు. వాళ్లకు తెలివి తక్కువ ఉండి.. ఇతరులకు కూడా ఉందనుకుంటరు. వాళ్లకు ఉన్న సోమరిపోతుతనం, వాళ్ల పరిపాలన సామర్థ్యం లేని అవివేకం అందరికీ ఉన్నాయనుకుంటరు. తెలంగాణకున్న స్థాయి కేంద్రానికి లేదు. యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మన దాంట్లో 50 శాతం కూడా ఇంకా ఏ రాష్ట్రంలో వేయలేదు. మేం తీసుకోం.. మేం దద్దమ్మలం అని చెప్పొచ్చుగా?’’ అని కేసీఆర్​ అన్నారు.  

కేంద్రాన్ని దోషిగా నిలబెట్టినం

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టామని సీఎం అన్నారు. వడ్లు కొనాలని కేంద్రాన్ని పలు మార్గాలుగా డిమాండ్‌‌‌‌ చేశామని, ఢిల్లీలోనూ దానిని ఎక్స్‌‌‌‌పోజ్‌‌‌‌ చేశామని చెప్పారు. ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టామన్నారు. ‘‘మన ధాన్యం కొనేందుకు కేంద్రం దగ్గర పైసలు లేక కాదు ప్రధానికి మనసులేకనే సమస్య వచ్చింది. బ్యాంకులను మోసం చేసినోళ్లను మోడీ ప్రభుత్వం దేశం దాటించింది. వాళ్లని అరెస్ట్​ చేయడానికి పోయినోళ్లను ఇదే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాపస్ పిలిపించిన్రు. ఆ డాక్యుమెంట్లు, ప్రూఫ్‌‌‌‌లు ఉన్నాయి. త్వరలోనే ఢిల్లీలో బయటపెడుతాం. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణలో వచ్చే డిఫరెన్స్ ఏందీ రూ. 3 వేల నుంచి రూ. 3,500 కోట్లు. రైతులకు ఆ డబ్బులు పెట్టుడు కేంద్రానికి చేతకాదా?’’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో తనతో మీటింగ్​లో  పాల్గొన్న రాకేశ్​ టికాయత్​ కూడా ఒక మహా సంగ్రామాన్ని మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తాను ముందుండి పనిచేస్తానన్నారు.  దేశానికి కొత్త ఇంటిగ్రేటెడ్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ పాలసీ రావాల్సి ఉందని, అశోక్‌‌‌‌ గులాటీ సహా ప్రముఖులతో హైదరాబాద్‌‌‌‌లో వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ ఏర్పాటు చేసి దానిని రూపొందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ పాలసీని అడాప్ట్​ చేసుకుంటుందో లేదో చూస్తామని, లేకుంటే రైతులు వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారని ఆయన చెప్పారు. 

పెట్రోల్​పై మేం వ్యాట్‌‌‌‌ పెంచలే

పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌‌‌‌ పెంచలేదని, అయినా కేంద్రం రోజూ పన్నులు పెంచుతూ రాష్ట్రాలను తగ్గించాలని డిమాండ్‌‌‌‌  చేయడం ఏందని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘పన్నుల్లో రెండు భాగాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటాయి. దాంట్లో పెట్రోల్, డీజిల్​ మీద రాష్ట్రానికి కూడా కొంత వ్యాట్​ వేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెంచలే. దించలే. 2015లో వ్యాట్​ పైసల్లో ఉంటే రౌండ్  ఫిగర్​ చేసి రూపాయి చేసినం. కానీ సెంటర్​ రోజుకు రూపాయి.. బారాణా , ఒక్క రోజు రెండు రూపాయలు పెంచి, స్టేట్​టాక్స్ తగ్గించాలి అని చెప్తున్నది.   నువ్వు పెంచాలి? మేం తగ్గించాలా? కేంద్రం జేబు నిండాలె.. మాది ఖాళీ కావాల్నా? దీని వెనుకున్న బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఫిలాసఫీ ఏంది అంటే.. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలుగా ఉండాలని ఉంది. ఆర్థికంగా రాష్ట్రాలు దివాళా తీయాలి...లైన్​లో చిప్ప పట్టుకుని నిలబడాలి.. వాళ్ల చెప్పు చేతల్లో ఉండాలి. ఇది ఫెడరల్‌‌‌‌ సమాఖ్యకు విరుద్ధంగా ఉండే దిక్కు మాలిన సిద్ధాంతం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రూప్స్​ ఇంటర్వ్యూలు రద్దు

గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెడ్​ పోస్టుల నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా సీఎస్​ సోమేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​ 1తోపాటు అన్ని పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవని, ఇతర రిక్రూట్​మెంట్​ ఏజెన్సీలకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. డిపార్ట్​మెంటల్​ సెలక్షన్​ కమిటీలకు కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. -పోలీస్ ఉద్యోగాల వయోపరిమితిని మరో మూడేండ్లు పెంచుతూ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌  చేసింది.  మహిళా వర్సిటీ ఏర్పాటుకు గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించే, ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌‌‌‌గా నియమించడానికి అనుమతించారు. 

కొత్తగా ఆరు ప్రైవేట్​ వర్సిటీలు

హైదరాబాద్‌‌‌‌లో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ ఉందని, ఈ నేపథ్యంలో ఆరు ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్​ చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల చట్టం ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తామని, త్వరలోనే ఆయా శాఖలు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తాయన్నారు. కావేరి అగ్రికల్చర్​ , సీఐఐ, ఆమిటీ, ఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌, గురునానక్‌‌‌‌, నిక్‌‌‌‌మర్‌‌‌‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా యూనివర్సిటీ వెంటనే ఫోర్స్​లోకి తేవాలని నిర్ణయించామని,  ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని తెలిపారు. సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌ రంగంలోనూ హైదరాబాద్‌‌‌‌కు ప్రాధాన్యం ఉందని, ఆ రంగంలోని కోర్సులకు ఎంతో ప్రాధాన్యం ఉందని, వాటిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో రెండో రన్‌‌‌‌ వే ఏర్పాటుకు పనులు మొదలవుతాయని చెప్పారు.  యూనివర్సిటీల్లో 3,500 పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఈ ఉద్యోగాల నియామకం కోసం కామన్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. మే 20 నుంచి పట్టణ, పల్లె ప్రగతి నిర్వహిస్తామన్నారు. 

యాసంగి వడ్లలో నూకల శాతం పెరుగుతది. మామూలు టైంలో వంద కిలోల వడ్లకు 67 కిలోల బియ్యం  వస్తది. యాసంగిలో అయితే దానిలో సగం అంటే 33,  34 కిలోల బియ్యం వస్తది. ఆ నష్టం మూడున్నర వేల కోట్లయితది. దాన్ని కేంద్రమే భరించాలి. కానీ, అది చేతకాక గందరగోళం సృష్టిస్తున్నరు. మోరీల్లాగా నోర్లు పెట్టుకొని.. పెడబొబ్బలు పెడ్తున్నరు.  రెండు మూడు వేల కోట్లు ఖర్చయినా సరే రైతులు నష్టపోవద్దని నిర్ణయించినం. ఈ యాసంగి వడ్లను ఒక్క గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తది. దానికి వచ్చే వ్యత్యాసం ఎంత.. దానికి మేం భరించాల్సింది ఎంత.. అనేదాన్ని సీఎస్​ కమిటీ నిర్ణయిస్తది. 
            ‑ సీఎం కేసీఆర్​