ఏడాదైనా అమలుకాని సీఎం, మంత్రి హామీలు

ఏడాదైనా అమలుకాని సీఎం, మంత్రి హామీలు

మెదక్/పాపన్నపేట, వెలుగు : కాలేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్  ప్రాజెక్ట్​ ను గతేడాది ప్రారంభించిన సందర్భంగా మల్లన్నసాగర్, రంగనాయక్​ సాగర్, కొండపోచమ్మ సాగర్​ ప్రాజెక్ట్​లతోపాటు, మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్​, ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ ప్రాంగణాన్ని అన్నిహంగులతో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు రూ.1,500 కోట్లు మంజూరు చేస్తామని సీఎం చెప్పారు. అందులో భాగంగా ఏడుపాయలకు రూ.100 కోట్లు ఇస్తామన్నారు. ఈ క్రమంలో గతేడాది మహా శివరాత్రి జాతర ప్రారంభం సందర్భంగా ఏడుపాయలకు వచ్చిన మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కూడా రూ.100 కోట్లతో ఏడుపాయలను అన్ని హంగులతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏడుపాయల్లో కాటేజీలు నిర్మిస్తామని, వనదుర్గా మాత ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తామని, గ్రీనరీ డెవలప్​ చేస్తామని, ప్లే ఏరియా, వ్యూపాయింట్లు, పార్కింగ్​ సౌకర్యాలు కల్పిస్తామని, మౌలిక వసతులు మెరుగు పరుస్తామని చెప్పారు. అయితే ఏడాదైనా ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. ఇటీవల బడ్జెట్ లో కూడా ఆ నిధుల 
ఊసు లేదు. దీంతో జిల్లావాసులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 

ఆలయం వద్ద సౌలతుల్లేక సమస్య..

ఏడుపాయలకు ఏడాది పొడువునా తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మహాశివరాత్రికి  మూడు రోజులు పాటు వైభవంగా జరిగే జాతరను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్​ఫెస్టివల్​గా నిర్వహిస్తోంది. జాతరకు ఏడెనిమిది లక్షల మంది భక్తులు వస్తారు. దసరా సందర్భంగా తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం 20 వేల మంది వరకు వస్తారు. ఇతర సెలవు రోజుల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఏడుపాయలలో భక్తులకు సరైన సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. దాతలు నిర్మించిన సత్రాలు, షెడ్​ లు మినహా భక్తులు బస చేసేందుకు వసతి సౌకర్యాలు లేవు. స్నాన ఘట్టాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, టాయిలెట్లు సమస్యగానే ఉన్నాయి. జాతర సమయంలో వేలాది వెహికల్స్​వస్తాయి. పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా సీఎం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఏడుపాయలకు ఇక మహర్ధశ వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ నిధులు రాకపోవడంతో  నిరాశలో ఉన్నారు. 


ఉమ్మడి మెదక్ ​జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయక్​ సాగర్​, కొండపోచమ్మ సాగర్​ ప్రాజెక్ట్​లతో పాటు, ఏడుపాయల, వనదుర్గా ప్రాజెక్ట్​ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చదిద్దేందుకు ముఖ్యమంత్రి రూ.1,500 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అందులో నుంచి రూ.100 కోట్లు ఏడుపాయలకు కేటాయిస్తాం. 
- గతేడాది ఏడుపాయల జాతర సందర్భంగా మంత్రి హరీశ్​ రావు​

ప్రభుత్వం యాదాద్రితోపాటు భద్రాచలం, వేములవాడ, కొమురవెల్లి, ఏడుపాయల ఆలయాలను అభివృద్ధి చేస్తోంది. 
- గతేడాది శివరాత్రి జాతర సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ 

ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం, వనదుర్గా ప్రాజెక్ట్​ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం మంజూరు చేసే రూ.100 కోట్లతో 
మౌలిక వసతులు మెరుగుపర్చడంతోపాటు, భక్తులు, పర్యాటకుల కోసం కాటేజీలు నిర్మిస్తాం.
- గతంలో హామీ ఇచ్చిన మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి