సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే

సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే

అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని వెల్లడి


చండూరు, వెలుగు:  మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మూడున్నరేండ్లుగా అసెంబ్లీలో కొట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన మునుగోడు ప్రజలకు సేవ చేయాలని అనుకున్నానని, కానీ ప్రభుత్వం సహకరించనందుకే రాజీనామా చేశానని చెప్పారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ పనుల మీద కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ నియంత పాలనకు మునుగోడు ప్రజలే చరమగీతం పాడాలన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా గట్టుప్పల్​లో నియోజకవర్గ ప్రజలు, చేనేత కార్మికులతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేయాలని ఏండ్ల తరబడి కొట్లాడితే పట్టించుకోలేదని, తాను అమిత్ షాను కలిసిన మర్నాడే మండలం ప్రకటించారని చెప్పారు. చేనేత కార్మికుల కోసం ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. తన రిజైన్  వల్లే సీఎం కేసీఆర్ మునుగోడుకు వచ్చిండన్నారు. 

చెక్కుల పంపిణీలోనూ దిగజారుడా?  

పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ను వెంటబెట్టుకుని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి జగదీశ్ రెడ్డి పంపిణీ చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీలోకి టీఆర్ఎస్ జెడ్పీటీసీ వస్తే దిష్టిబొమ్మ దహనం చేయడంపైనా ఆయన ఫైర్ అయ్యారు. గట్టుప్పల్ జెడ్పీటీసీ వెంకటేశం, ఎంపీటీసీ శ్రీనివాస్ లకు స్వార్థమే ఉంటే టీఆర్​ఎస్​లోనే ఉండి పనులు చేసుకునేవారని, ధర్మం వైపు నిలబడాలనే తనతో వచ్చారన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన మాదగోని జయమ్మ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేశారు. పార్టీ మారితే అమ్ముడుపోయానని తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని, అయినా భయపడేదిలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు.  కమ్మగూడెంలో పార్టీలోకి పలువురి చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? కేసీఆర్ అహంకారాన్ని పోగొట్టాలంటే మునుగోడులో బీజేపీ గెలవాలన్నారు. కేసీఆర్ వెంట ఉండే ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ ఎన్నడు ఉద్యమం చేసిర్రు? అని రాజగోపాల్​ రెడ్డి ప్రశ్నించారు. 

బీజేపీలోకి భారీగా చేరికలు 

గట్టుప్పల్ లో జెడ్పీటీసీ కర్ణాటి వెంకటేశం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్ చార్జీలతోపాటు మరో100 మంది పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది, కమ్మగూడెంలో కాంగ్రెస్ నుంచి సర్పంచ్ గోలీ లుర్ధమ్మ, ఉప సర్పంచ్ గోలి ప్రసాద్, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ నోముల రవి శేఖర్, మరో 400 మంది బీజేపీలో చేరారు.