జాబ్స్‌‌ ఇప్పిస్తానంటూ మోసం చేసిన మహిళ.. కలెక్టర్‌‌ సంతకాలతో నకిలీ అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్లు

జాబ్స్‌‌ ఇప్పిస్తానంటూ మోసం చేసిన మహిళ.. కలెక్టర్‌‌ సంతకాలతో నకిలీ అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్లు
  •     పది మంది వద్ద లక్షల్లో వసూళ్లు

 నిజామాబాద్, వెలుగు : ఓ మహిళ కలెక్టర్ల సంతకాలతో ఫేక్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్లు తయారుచేసి, సర్కార్‌‌ కొలువులు ఇప్పిస్తానని యువకులను నమ్మించి లక్షల్లో వసూలు చేసింది. ఈ ఘటన నిజామాబాద్‌‌ జిల్లాలో వెలుగుచూసింది. సీఐ శ్రీనివాస్‌‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టె స్వరూప అనే మహిళ ఆర్‌‌అండ్‌‌బీ ఉద్యోగినని చెప్పుకుంటూ... నగరంలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో పాటు కలెక్టర్లు రాజీవ్‌‌గాంధీ హనుమంతు, వినయ్‌‌ కృష్ణారెడ్డి సంతకాలతో ఫేక్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్లు తయారుచేసి నిరుద్యోగులను నమ్మించింది.

 ఇలా 10 మంది వద్ద రూ. 4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసింది. మరికొంత డబ్బు ఇస్తే అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్లు ఇస్తానని చెప్పింది. ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చిన రమావత్‌‌ రాజు, శ్రీనివాస్‌‌లు అపాయింట్‌‌మెంట్‌‌ లెటర్ల కోసం ఒత్తిడి తేవడంతో వారిపై బెదిరింపులకు దిగింది. 

దీంతో మోసపోయామని భావించిన నిరుద్యోగులు నిజామాబాద్‌‌ రూరల్‌‌, త్రీటౌన్‌‌, నాలుగో పట్టణ పోలీస్‌‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. స్వరూపపై ఆదిలాబాద్‌‌ జిల్లాలోనూ రెండు కేసులు ఉన్నాయని సీఐ శ్రీనివాస్‌‌రాజు తెలిపారు. నిందితురాలు స్వరూపకు రైల్వేశాఖలో హెడ్‌‌ కానిస్టేబుల్‌‌గా పనిచేసే వీర్రాజు సహకరించారని సీఐ వివరించారు.