ముందస్తు ముచ్చటే లేదు.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌దే గెలుపు

V6 Velugu Posted on Oct 18, 2021

  • హుజూరాబాద్‌లోటీఆర్ఎస్​దే గెలుపు
  • 27న అక్కడ ప్రచార సభలో పాల్గొంట
  • ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా ‘తెలంగాణ విజయగర్జన’
  • జనాన్ని తరలించేందుకు 22 వేల బస్సులు
  • కొందరి నిర్లక్ష్యంతో గతంలో ఎంపీ సీట్లు కోల్పోయాం
  • ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మనమే కీలకమైతం
  • నిర్లక్ష్యాన్ని సహించ, సీట్లు పెంచుకోవాలె

హైదరాబాద్‌, వెలుగు: ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘నేను పార్టీ సమావేశం పెడుతున్ననంటే, ముందస్తు ఎన్నికలపై చెప్తనని అందరూ అనుకుంటున్నరు. ఈసారి అలాంటిదేమీ ఉండదు. మనకింకా రెండేండ్ల టైముంది. ఈ రెండేళ్లు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నయి” అని టీఆర్ఎస్ జాయింట్‌ లెజిస్లేటివ్‌ పార్టీ నేతలనుద్దేశించి అన్నారు. టీఆర్ఎస్ 20 ఏళ్ల ఉత్సవాల సన్నాహకాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో పలు అంశాలపై ఆయన రెండు గంటలకు పైగా మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదన్నారు. అక్కడ పోటీ బీజేపీతోనే ఉందని, గెలిచేది టీఆర్ఎస్సేనని అన్నారు. బీజేపీ కంటే 13 శాతం ఓట్ల లీడ్‌లో ఉన్నట్టు లేటెస్ట్‌ సర్వేల్లో తేలిందని చెప్పారు. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత హుజూరాబాద్‌ ప్రచారానికి వెళ్తానని చెప్పారు. 27న ప్రచారం చివరి రోజు తన సభ ఉండొచ్చన్నారు. సభకు ఇన్‌చార్జిగా మంత్రి కేటీఆర్‌ను నియమించినట్లు చెప్పారు.  కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ ప్రాధాన్యత పెరగనుందని కేసీఆర్ అన్నారు. దళితబంధును రాష్ట్రమంతటా అమలు చేస్తామని, ఏటా బడ్జెట్‌లో మంచి కేటాయింపులు చేస్తామని చెప్పారు.

‘‘సభకు క్యాడర్‌‌ను రెడీ చేయడంపై కేటీఆర్‌‌, సెక్రటరీ జనరల్‌‌ కె.కేశవరావు ఆధ్వర్యంలో సోమవారం నుంచి రోజుకు 20 సెగ్మెంట్ల నుంచి 20 మంది చొప్పున మీటింగులుంటై. సభకు క్యాడర్‌‌ను తరలించే బాధ్యతను గ్రామ కమిటీల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు తీసుకోవాలె. ప్రతిదానికి ఎమ్మెల్యేపై, ఇంకొకరిపై డిపెండ్‌‌ కావొద్దు. అందుకు ఎంపిక చేసిన 20 మందికి బాధ్యతలు అప్పగిస్తం” అని చెప్పారు. ‘‘ప్రభుత్వ పనులను ప్రజలు ఆదరించారు. అందుకే 2018లో ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు. లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా లాంటి కారణాలతో ఆ విజయోత్సవాన్ని క్యాడర్‌‌తో కలిసి జరుపుకోలేకపోయినం. అందుకే ఇప్పుడు పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ, కార్యకర్తలతో విజయగర్జన సభ జరుపుకుంటున్నం. జిల్లా పార్టీ ఆఫీసులు మొదలైనంక క్యాడర్‌‌కు శిక్షణ తరగతులు నిర్వహిస్తం. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటం. ప్రజల కోణంలో పాలన అందించేందుకే ధరణి పోర్టల్‌‌ తెచ్చినం. కొత్త మున్సిపల్‌‌ యాక్ట్‌‌, పంచాయతీరాజ్‌‌ చట్టం సహా ఎన్నో సంస్కరణలు తెచ్చినం. ప్రాజెక్టుల నిర్మాణం కొలిక్కి వచ్చింది. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తం” అని కేసీఆర్ అన్నారు. నేషనల్ ఇష్యూస్​తో పాటు పలు అంశాలపై ప్లీనరీలో తీర్మానాలు చేస్తామన్నారు.

ప్లీనరీకి 6,500 మంది

25న హెచ్‌‌ఐసీసీలో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి ఆహ్వానితుల సంఖ్యను 6,500 మందికి పరిమితం చేసినట్టు కేసీఆర్ చెప్పారు. ‘‘రాష్ట్ర కార్యవర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతలకే ఆహ్వానాలుంటై. సెగ్మెంట్​కు 50 మంది చొప్పున ముఖ్య నేతలను ప్రతినిధులుగా ఆహ్వానిస్తం. వాళ్లు మాత్రమే రావాలె” అన్నారు. ప్లీనరీ విజయవంతానికి ఇప్పటికే కమిటీలు వేశామన్నారు.

అజయ్‌‌.. ఆర్టీసీలో ఎన్ని బస్సులున్నై?

ఆర్టీసీలో ఎన్ని బస్సులున్నాయని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌‌ను కేసీఆర్‌‌ ప్రశ్నించారు. ఆయన మీటింగ్‌‌ హాల్‌‌ నుంచి బయటికి వెళ్లి ఆర్టీసీ అధికారులకు ఫోన్‌‌ చేశారు. వాళ్లూ చెప్పలేకపోయారు. ఈలోగా సీఎం పిలుస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో హడావుడిగా మీటింగ్‌‌ హాల్లోకి వెళ్లారు. ఎన్ని బస్సులున్నాయని సీఎం మళ్లీ అడిగినా చెప్పలేకపోయారు. దాతో సంస్థలో ఎన్ని బస్సులున్నయో తెల్వదా అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు.

నేటి నుంచి నేతలతో కేటీఆర్‌‌ భేటీ

వరంగల్‌‌ విజయగర్జన సభపై సోమవారం నుంచి పార్టీ నేతలతో కేటీఆర్‌‌, సెక్రటరీ జనరల్‌‌ కె. కేశవరావు సమావేశం కానున్నారు. రోజుకు 20 నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతారు. దీనిపై టీఆర్ఎస్ ముఖ్యులతో కేటీఆర్‌‌ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కేసీఆర్‌‌ తరపున 6 సెట్ల నామినేషన్లు

టీఆర్‌‌ఎస్‌‌ అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌ ప్రొఫెసర్‌‌ శ్రీనివాస్‌‌ రెడ్డి ఆదివారం నోటిఫికేషన్‌‌ జారీ చేశారు. నామినేషన్ల దాఖలుకు 22న సాయంత్రం మూడింటి దాకా అవకాశమిచ్చారు. 22 సాయంత్రం నామినేషన్ల పరిశీలన, 24న మధ్యాహ్నం మూడింటిదాకా ఉపసంహరణకు గడువు ఉంటుంది. 25న ప్రతినిధుల సభలో అధ్యక్షున్ని ఎన్నుకుంటారు. తర్వాత ప్లీనరీ జరుగుతుంది. కేసీఆర్ తరఫున ఆదివారం ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు సత్యవతి రాథోడ్‌‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ఇంద్రకరణ్‌‌ రెడ్డి, నిరంజన్‌‌ రెడ్డి, శ్రీనివాస్‌‌ గౌడ్‌‌, తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, జగదీశ్‌‌ రెడ్డి, మల్లారెడ్డి, అజయ్‌‌ కుమార్‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేర్వేరుగా వీటిని దాఖలు చేశారు. అధ్యక్ష ఎన్నికలో ఓటేసేందుకు ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది గుర్తించిన ఓటర్లతో ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ సిద్ధం చేశారు. ఈ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉంటారు.

ప్రాంతీయ పార్టీల్లో మనమే స్ట్రాంగ్

60 లక్షల సభ్యత్వాలతో దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌ పటిష్టంగా ఉందని కేసీఆర్ అన్నారు. ఇంత భారీ క్యాడర్‌ బలమున్న పార్టీకి ఎవ్వరూ పోటీ కాదన్నారు. ‘‘ఈ మధ్య కొందరు ఇష్టమొచ్చినట్టు మొరుగుతున్నరు. వాటి నోళ్లు మూయించే రోజు దగ్గర్లోనే ఉంది. విజయగర్జన సభతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాలె” అని అన్నారు. నవంబర్ 15న వరంగల్‌లో 10 లక్షల మందితో తెలంగాణ విజయగర్జన బహిరంగ సభ జరుపుకుందాం. మనపై ఇష్టమొచ్చినట్టు మొరుగుతున్నవాళ్ల నోర్లు మూయిద్దాం. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా సభ ఉంటది. సభకు 22 వేల బస్సులతో ప్రజలను తరలిస్తం.
 

Tagged CM KCR, Telangana Bhavan, TRS Meeting, early elections

Latest Videos

Subscribe Now

More News