
నాలుగు ఎంపీలు గెలువంగనే సిపాయిలమంటున్నరు వాళ్ల మాటలు వింటుంటే నవ్వొస్తుంది.
కాంగ్రెస్కు సొంత నేతలే నష్టం చేస్తరు
రాష్ట్రంలో టీఆర్ఎస్సే బలమైన రాజకీయ శక్తి
రెండ్రోజుల్లో కేబినెట్..
మున్సిపల్ ఆర్డినెన్స్‌కు ఆమోదం..
ఆగస్టు మొదట్లో ఎన్నికలు.. అన్ని మున్సిపాలిటీలు గెలువాలె
త్వరలో జడ్పీ చైర్పర్సన్లకు అధికారాలు టీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్
తమకు బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయమే కాదని, అసలు రాష్ట్రంలో ఆ పార్టీలు లేనే లేవని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. ఎనిమిది మంది జడ్పీటీసీలు ఉన్న పార్టీ తామే ప్రత్యామ్నాయం అంటోందని, రేపో ఎల్లుండో అధికారంలోకి వస్తామంటోందని, ఆ మాటలు వింటుంటే నవ్వొస్తోందని బీజేపీని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు గంట 15 నిమిషాల పాటు ఆయన వివిధ అంశాలపై ప్రసంగించారు. బీజేపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ నాయకులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రతి విమర్శలు చేసి హీరోలను చేయొద్దని, వీలైనంత వరకు బీజేపీని లైట్‌గా తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. ‘‘బీజేపీ నాలుగు ఎంపీలు గెలువంగనే తమంత సిపాయిలం లేమన్నట్టు మాట్లాడుతున్నది. ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల మూడ్ వేరేగా ఉన్నది. అందుకే వాళ్లకు అన్ని ఎంపీ సీట్లు వచ్చినయి. తర్వాత జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్ల ఆ పార్టీ పరిస్థితి ఏందో తేలిపోయింది” అని పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీల 119 మంది ఎమ్మెల్యేలుంటే అండ్ల మనమే 104 మందిమి. మండలిలో మొత్తం 40 మందికి 31 మందిమి మనమే ఉన్నం. ఇంకా మూడు (మొదటిపేజీ తరువాయి)
ఖాళీలున్నయి. 32 జిల్లా పరిషత్‌లకు అన్నీ మనమే గెలిచినం. సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీలు అంతటా మనోళ్లే ఉన్నరు. రాష్ట్రంల మనమే బలమైన రాజకీయ శక్తి. మనకు బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయమే కాదు. అసలు రాష్ట్రంల ఆ రెండు పార్టీలు లేనే లెవ్వు. గా పార్టీలు మనకు పోటా? కానే కాదు’’ అని టీఆర్ఎస్ నాయకులతో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదని, ఆ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో తెలియదని, ఒకరి మీద ఒకరు షికాయత్‌లు చేసుకుంటారని విమమర్శించారు. కాంగ్రెస్‌ను ఎవరూ ఏమి చేయాల్సిన అవసరం లేదని, అక్కడున్న నేతలే దానికి చేయాల్సిన నష్టం చేస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేకనే మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వచ్చారని తెలిపారు. ముందు ముందు ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.
రెండురోజుల్లో కేబినెట్భేటీ
రెండు రోజుల్లో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి మున్సిపల్ చట్టం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపుతామని కేసీఆర్ తెలిపారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఆగస్టు మూడోవారంలోగా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు అందరూ బాధ్యతగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్నారు.
జడ్పీ చైర్పర్సన్లకు సహాయ మంత్రి హోదా
పరిపాలనలో జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అత్యంత కీలకం కాబోతున్నారని సీఎం అన్నారు. 32 మంది జడ్పీ చైర్పర్సన్లకు సహాయ మంత్రి హోదా కల్పిస్తామని, విస్తృతస్థాయిలో అధికారాలిస్తామని చెప్పారు. నెలకు లక్ష రూపాయల జీతం, కొత్త కార్లు కొనిస్తామన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం జడ్పీ చైర్పర్సన్ల ఆధీనంలోనే పనిచేస్తుందని, మిగతా శాఖలను వారి పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం ప్రభుత్వమే జీతం ఇస్తుందని, ఎవరూ ఎవరి దగ్గర చేయి చాచి డబ్బులు అడగొద్దని అన్నారు. ఏటా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పర్యటించి అక్కడి సమస్యలు, పరిపాలనా విధానంపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఆయా ప్రాంతాల్లో అమల్లో ఉన్న విధానాలపై పట్టుసాధిస్తే మరింత సేవలందించవచ్చన్నారు.
నేను, హరీశ్ ఎంతో కష్టపడ్డం
ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, పార్టీ ఆఫీసు పెట్టుకుందామంటే ఎవరూ ఇల్లు కిరాయి కూడా ఇవ్వని పరిస్థితిని చూశామని కేసీఆర్అన్నారు. అప్పట్లో హైదరాబాద్ ఆఫీసు సామన్లు కూడా తీసుకొచ్చి బయటపడేశారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను, హరీశ్‌రావు ఎంతో కష్టపడి పనిచేశామని, కలిసి ఉద్యమాలు చేశామని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘అన్ని జిల్లాల్లో సకల సౌకర్యాలతో ఆఫీసులు నిర్మిస్తామని, క్యాడర్ ఆత్మగౌరవానికి పార్టీ ఆఫీసులు ప్రతీకలుగా నిలుస్తాయన్నారు.
టీవీ చర్చలకు పోవుడు బంద్ చేయండి
టీవీ చర్చలకు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు వెళ్లి మాట్లాడి పార్టీని ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఒక్కో టీవీలో ఒక్కో నేత ఒకే అంశంపై తమకు తోచినట్టుగా మాట్లాడి అదే పార్టీ స్టాండ్ అన్న భావన ప్రజల్లోకి వెళ్లేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ రోజు నుంచే అందరూ టీవీ చర్చలకు పోవుడు బంద్ చేయాలని ఆదేశించారు. పార్టీ స్టాండ్ ఏమిటో, ఏ అంశంపై ఎవరు సమర్థంగా మాట్లాడి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టగలరో గుర్తించి, వారినే చర్చలకు పంపిస్తామన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం
వరుస ఎన్నికలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించొద్దని ఎమ్మెల్యేలు జోగు రామన్న, అంజయ్య యాదవ్ సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్వైపే జనం ఉన్నారని, వారికి ఎలాంటి ఆగ్రహం లేదని, మీరే మైండ్ సెట్ మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు.
ఈ ఏడాదే కాళేశ్వరం నీళ్లు.. నెలలోగా భగీరథ పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించుకున్నామని, వర్షాలు కురిసి వరద రాగానే గోదావరి నీళ్లను ఎత్తిపోసి పొలాలకు మళ్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు ఆ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాటిని నెరవేరుస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పనులు 95 శాతానికిపైగా పూర్తయ్యాయని, మిగతా పనులను నెల రోజుల్లోగా కంప్లీట్ చేసి ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, కొత్త రాష్ట్రమైనా ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ విషయాలను వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కేసీఆర్‌కు ఫస్ట్ మెంబర్‌షిప్..హరీశ్రావుకు సెకండ్
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణభవన్‌లో పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. క్రియాశీల సభ్యత్వం రుసుము రూ.100 చెల్లించి తొలి మెంబర్‌షిప్ అందుకున్నారు. ఆయన తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌రావు మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఆపై మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతలు సభ్యత్వాలు తీసుకున్నారు. జులై 20లోగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ముగించి ఆ నెలాఖరులోగా గ్రామ, వార్డు, మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు. జిల్లా కమిటీల పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలో పార్టీ నిర్ణయం వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్‌ను పిలిచి కేసీఆర్ సభ్యత్వ బుక్కులు అందజేశారు.
జగన్ కాన్వాయ్ వెళ్లేదాకా వెయిట్ చేసిన కేసీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం సాయంత్రం 4.50 గంటలకు ముగియగా, అదే సమయానికి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ బయల్దేరింది. జగన్ కాన్వాయ్ వెళ్లేంతవరకు పది నిమిషాలపాటు కేసీఆర్ తెలంగాణ భవన్‌లోనే వెయిట్ చేశారు. ఆ తర్వాతే కేసీఆర్ కాన్వాయ్ తెలంగాణ భవన్ నుంచి బయటికి వచ్చింది.
ఇవాళ జగన్‌తో కేసీఆర్ మీటింగ్
ఏపీ సీఎం జగన్‌తో శుక్రవారం భేటీ కాబోతున్నట్టు కేసీఆర్ తెలిపారు. విభజన సమస్యలతో పాటు నదీ జలాల వినియోగంపై చర్చిస్తామన్నారు. రెండు రాష్ట్రాలు బాగుపడాలని, ఇందుకు ఇచ్చిపుచ్చుకోవడమే పరిష్కారమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియెట్, ఇతర భవనాలను కేటాయించడంతోనే కొత్త సెక్రటేరియెట్‌కు భూమి పూజ చేసుకున్నామన్నారు.