అసెంబ్లీలో అబద్దాలు చెప్పొద్దు : సీఎం కేసీఆర్ సీరియస్

అసెంబ్లీలో అబద్దాలు చెప్పొద్దు : సీఎం కేసీఆర్ సీరియస్

పంచాయతీ చట్టం చదివి రండి : అసెంబ్లీలో శ్రీధర్ బాబుకు సీఎం క్లాస్

అసెంబ్లీలో రెండోరోజు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేసిన అలిగేషన్స్ పై సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. అబద్దపు మాటలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రెండుసార్లు శ్రీధర్ బాబు ప్రసంగం మధ్యలో కలగజేసుకుని క్లాస్ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో అరాచకం సృష్టిస్తోందని… నాలుగున్నరేళ్లలో ఒక్క మెగావాట్ సోలార్ పవర్ ను ఉత్పత్తిచేయలేదని… గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపు ప్రస్తావన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. తీవ్రంగా స్పందించిన సీఎం కేసీఆర్… పంచాయతీలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశామనడం వందశాతం రాంగ్ అన్నారు. గ్రామపంచాయతీలకు రూ.40 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. గ్రామాల్లో కాంగ్రెస్ హయాంలో కొనసాగిన ఆరాచకాన్ని ఇకనుంచి కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. ఇంటి పన్నులను రివైజ్ చేసి… వచ్చిన నిధులతో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం.. అద్దాల్లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తామన్నారు సీఎం కేసఆర్.

గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా పనిచేయడం వల్లే స్థానిక సంస్థలు .. విద్యుత్ సంస్థలకు రూ.3వేల కోట్ల కరెంట్ బిల్లులను పెండింగ్ లో పెట్టాయన్నారు కేసీఆర్. చక్రవడ్డీ, బారువడ్డీలు కలిపి అంతమొత్తం అయిందని.. విద్యుత్ సంస్థలతో మాట్లాడి వన్ టైమ్ సెటిల్ మెంట్ చేయిస్తున్నానని వివరించారు కేసీఆర్.  గ్రామాల్లో పన్నులను పక్కాగా వసూలు చేయించడంతో పాటు… పెండింగ్‌లో ఉన్న బకాయిలను వంద శాతం వసూలు చేయిస్తామన్నారు కేసీఆర్. శ్రీధర్‌బాబు పంచాయతీరాజ్‌ యాక్ట్‌ చదివి మాట్లాడితే బాగుంటుందన్నారు. పంచాయతీలను పటిష్టం చేసేందుకే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తీసుకువచ్చామన్నారు కేసీఆర్.

“ఒక్క మెగావాట్ ఉత్పత్తి అయిందా అని ప్రతిపక్ష సభ్యుడు అడిగాడు.. ఒక్కటి కాదు.. 3వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. గత పాలకులకు చేతకానిది తెలంగాణ ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నాం. నెలల వ్యవధిలోనే విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి రికార్డు స్థాయిలో పవర్ జెనరేషన్ చేస్తున్నాం. అబద్దాలు చెప్పి ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు రికార్డుల్లోంచి తొలగించాలి. విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఇది నేను కొడుతున్న డబ్బా కాదు. దేశంలో ఎవరిని అడిగినా చెబుతారు” అని సీరియస్ గా అన్నారు కేసీఆర్.

కరెంట్ కొద్దిసేపు సీఎం ఇంట్లో కూడా పోతుంది.. పెద్ద మ్యాటర్ కాదు

24 గంటల కరెంట్‌ సరఫరా విషయంలో శ్రీధర్ బాబు చెప్పింది అబద్ధమన్నారు సీఎం కేసీఆర్. మహాదేవ్‌పూర్‌, కాటారం, పెద్దంపేట్‌ సబ్‌స్టేషన్ల సర్కిళ్లలో… 24 గంటల కరెంట్‌ సరఫరా అవుతోందనీ… రికార్డులు పరిశీలించాకే ఈ విషయం చెబుతున్నామన్నారు. టెక్నికల్ సమస్యలతో గంటో, అరగంటో కరెంట్‌ పోవడం కామనేనని చెప్పిన సీఎం.. ముఖ్యమంత్రి ఇంట్లో కూడా టెక్నికల్ సమస్యలతో పవర్ కట్స్ కొద్దిసేపు ఉంటాయన్న సంగతి గుర్తుచేశారు.