ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్​ ఓడుడే

ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్​ ఓడుడే

హుజూర్ నగర్, వెలుగు : ఎన్నికలు ఎప్పుడొచ్చిన కేసీఆర్ ను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  అన్నారు. జాతీయస్థాయిలో కొత్త పార్టీని పెడతానని  కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  సోమవారం హుజూర్ నగర్ లో జరిగిన బీజేపీ ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఆయన మాట్లాడారు.  దశాబ్దాలపాటు  పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని,  కేసీఆర్ ను సీఎం చేసి గద్దెనెక్కిస్తే ఎనిమిదేళ్లలో  అప్పుల తెలంగాణ గా మార్చాడని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని అన్నారు. గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారని,  టీఆర్ఎస్ నాయకులు గిరిజనుల  భూములనే  బలవంతంగా గుంజుకొంటున్నారని ఆరోపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండాలోని 540 సర్వే నంబర్​లోని భూములే ఇందుకు సాక్ష్యమని గుర్తుచేశారు. ఆర్టీసీ,కరెంటు ,రిజిస్ట్రేషన్ ,మద్యం ధరలు పెంచి ప్రజల మీద రూ. 25వేల కోట్ల భారం మోపారని చెప్పారు. హైదరాబాదులో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగ భృతి ,వితంతు పెన్షన్ లు ,రేషన్ కార్డులు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు తప్ప ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలకు విలువ లేదన్నారు. కాంగ్రెస్ కు  ఓటు వేసి గెలిపిస్తే నాయకులు  టీఆర్ఎస్ లోకే వెళ్తారని, కాంగ్రెస్​కు ఓటేస్తే టీఆర్​ఎస్​కు వేసినట్టేనన్నారు.  కేసీఆర్ చేసే మోసాలను అడ్డుకోవాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.

ఎన్నికలప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మోసకారి మాటలు మాట్లాడతాడన్నారు.   ప్రభుత్వం నిర్మించే కొత్త  బిల్డింగులకు, మెగా విలేజీపార్క్​లకు  దళితుల, గిరిజనుల భూములు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం అమ్మిన డబ్బులతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి దాపురించిందన్నారు.  వరి రైతులకు  గిట్టుబాటు ధర రాకుండా టీఆర్ఎస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్నారు. ఆర్డీవో కార్యాలయాలను ఎమ్మెల్యే ల క్యాంపుఆఫీసులుగా మార్చుకొని  భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు .  ధరణి వెబ్ సైట్ తో  22 లక్షల ఎకరాలు బ్లాక్ చేసి భూయజమానులను   ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.   చింతల బజారు లో ఇల్లు కూల్చివేత బాధితులు రాజేందర్​కు వినతి పత్రం ఇచ్చారు. అంతకు ముందు హుజూర్ నగర్ బీజేపీ లీడర్లు ఆయనను గజమాలతో  సత్కరించారు. కార్యక్రమంలో  సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.