50 వేల కొలువుల  ముచ్చటే లేదు

50 వేల కొలువుల  ముచ్చటే లేదు

కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోని సీఎం
ఖాళీల వివరాలు గుర్తించినా ఆమోద ముద్ర వేయలే
లక్షలాది మంది నిరుద్యోగులకు మరోసారి నిరాశ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీని సర్కార్ పక్కన పెట్టేసింది. వేకెంట్ పోస్టులను ఐదు రోజుల్లో గుర్తించాలని గత కేబినెట్ మీటింగ్​లో ఆదేశించిన సీఎం కేసీఆర్.. 17 రోజుల తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. జులై 13,14 తేదీల్లో కేబినెట్ సమావేశమైంది. 50 వేల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్​మెంట్‌‌లో భాగంగా పక్కాగా ఖాళీలను గుర్తించి నివేదించాలని సీఎం అన్ని డిపార్ట్​మెంట్లకు ఆదేశించారు. అన్ని డిపార్ట్​మెంట్ల మంత్రులు, సెక్రటరీలు ఖాళీల వివరాలు తీసి, ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​కు పంపారు. ఖాళీలు, ప్రమోషన్లతో మిగిలిన పోస్టులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల వివరాలతో కలిపి 70 వేలకు పైగా వేకెంట్ పోస్టులున్నట్లు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ రిపోర్ట్ తయారు చేసింది. దీనిపై మంత్రి హరీశ్​రావు రివ్యూ చేశారు. అవే వివరాలను కేబినెట్‌‌కు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఖాళీలపై క్యాబినేట్​లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నాన్చుడు ధోరణి ఇంకెన్నాళ్లు
50 వేల పోస్టుల రిక్రూట్​మెంట్, వేకెంట్ పోస్టుల సంఖ్యపై సర్కార్ ఇంకా నాన్చుడు ధోరణినే అవలంబిస్తోంది. కావాలనే నోటిఫికేషన్లు ఆలస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఖాళీలపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నరు. నిజంగా రిక్రూట్​మెంట్​ చేయాలని అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేని పోస్టులకు పర్మిషన్ ఇచ్చి, నోటిఫికేషన్ జారీ చేయొచ్చని అధికారులే అంటున్నారు. ఇప్పటికే ఆరేడు సార్లు వేకెంట్ పోస్టుల వివరాలు సమగ్రంగా ఇచ్చామని వివిధ డిపార్ట్​మెంట్ల ఉన్నతాధికారులు చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం చేశారు. తర్వాత జూలై 9న రిక్రూట్​మెంట్ ప్రక్రియ వెంటనే మొదలుపెట్టాలని ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడేమో పూర్తిగా పక్కన పెట్టేశారు.