షిఫ్టింగ్​ ఎందుకింత లేటు? అధికారులపై సీఎం ఆగ్రహం

షిఫ్టింగ్​ ఎందుకింత లేటు?  అధికారులపై సీఎం ఆగ్రహం

ఇవాళ, రేపు అంటూ సాగుతూ వచ్చిన సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​ పనులు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. తరలింపులో జరుగుతున్న జాప్యంపై సీఎం కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఎందుకిలా లేటవుతోందని ప్రశ్నించారని తెలుస్తోంది. వెంటనే షిఫ్టింగ్​ ప్రారంభించాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో అధికారులు హడావుడిగా షిఫ్టింగ్​ మొదలుపెట్టారు. బుధవారమే రోడ్లు భవనాల శాఖను ఎర్రమంజిల్​లోని ఈఎన్సీ ఆఫీసుకు తరలించారు. గురువారం నుంచి శాఖ కార్యకలాపాలు అక్కడే జరుగనున్నాయి. ఇక గురువారం మరికొందరు మంత్రుల కార్యాలయాలు, డిపార్ట్​మెంట్లను తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే బీఆర్కే భవన్​లో రిపేర్లు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో వెంటనే షిఫ్ట్​ అయ్యేందుకు అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.

మిగతా చోట్లకు మార్చేవి మొదలు..

జీఏడీ, రోడ్లు భవనాల శాఖ, ప్యాకర్స్​ అండ్ మూవర్స్​ ఏజెన్సీల ప్రతినిధులతో సీఎస్​ఎస్​కే జోషి సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికప్పుడు తనకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. బీఆర్కే భవన్​లో రిపేర్లు చాలా అవసరమని, అందుకు కనీసం మూడు వారాల టైం పడుతుందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ముందుగా మంత్రుల పేషీలను షిఫ్ట్​ చేసి, తర్వాత శాఖలను మార్చాలని భావించారు. కానీ సీఎం సీరియస్ కావడంతో డిపార్ట్​మెంట్ల తరలింపు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. అన్ని శాఖల్లో ఫైళ్లను ప్యాక్​ చేసే పని మొదలుపెట్టారు. సెక్రటేరియెట్ డీ బ్లాక్ రెండో ఫ్లోర్ లోని ఆర్​అండ్​ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చాంబర్ తోపాటు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ పేషీని ఎర్రమంజిల్ లోని ఈఎన్సీ ఆఫీస్ కు తరలించారు. ఇక మంత్రి శ్రీనివాస్​గౌడ్, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా బుధవారం బీఆర్కే భవన్ ను పరిశీలించారు. రిపేర్లు వేగంగా చేయాలని ఆదేశించారు. అయితే బీఆర్కే భవన్ కాకుండా హైదరాబాద్​లోని ఇతర ఆఫీసుల్లోకి తరలించే శాఖలను గురువారం నుంచి షిఫ్ట్​ చేయాలని నిర్ణయించారు.

వివిధ ప్రదేశాలకు షిఫ్టింగ్..

సీఎస్​ పేషీని బీఆర్కే భవన్​లోని 9వ ఫ్లోర్​లో ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత త్వరగా తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 9వ ఫ్లోర్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బీఆర్కే భవన్ లో అందరు మంత్రుల చాంబర్లకు ప్లేస్ సరిపోని కారణంగా కొందరి చాంబర్లను ఆయా శాఖల కమిషరేట్లకు తరలించనున్నారు. అరణ్య భవన్ కు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చాంబర్ తరలివెళ్లనుంది. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలోని రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చాంబర్ ను తరలించనున్నట్లు తెలుస్తోంది. హోం మంత్రి చాంబర్ ను లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీసుకు మార్చనున్నట్టు సమాచారం.

రిపేర్లు అయ్యాకే తరలించండి..

బీఆర్కే భవన్  రిపేర్లు పూర్తయ్యాకే షిఫ్టింగ్ చేయాలని ఉద్యోగులు, సిబ్బంది అంటున్నారు. హడావుడిగా తరలించడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు. భద్రత, పార్కింగ్, పనిచేసే వాతావరణం ఇలా ఏ అంశానికి సంబంధించి కూడా బీఆర్కే భవన్ లో వసతులు సరిగా లేవని గుర్తుచేస్తున్నారు.