
జాతీయ చేనేత దినోత్సవం (ఆగష్టు 7) సందర్భంగా సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగష్టు 7,2022 నుండి "నేతన్న బీమా" పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని సీఎం అన్నారు. నేతన్నల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో తొలిసారని తెలిపారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలు ఈ బీమా ద్వారా లబ్ది పొందటం సంతోషకరమైన విషయమని సీఎం అన్నారు.
దురదృష్టవశాత్తు ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇది ప్రజా సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుంటే, సహకరించాల్సిన కేంద్రం మాత్రం పన్ను పెంపులతో చేనేత, పవర్ లూం రంగాన్ని కుదేలు చేస్తున్నదని సీఎం విమర్శించారు. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడ్డ పద్మశాలీ తదితర కుటుంబాలకు అన్ని వేళలా బాసటగా నిలుస్తుందని సీఎం కేసిఆర్ పునరుద్ఘాటించారు.