లాలూ లెక్కనే కేసీఆర్‌‌కు జైలు భయం పట్టుకుంది

లాలూ లెక్కనే కేసీఆర్‌‌కు జైలు భయం పట్టుకుంది
  • వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై కేసీఆర్ సర్కార్
  • మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు బయటకు పోతరో తెలియదు: సంజయ్
  • రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం భూమియ్యలేదని ఆరోపణ 

ములుగు/వరంగల్‍ రూరల్‍, వెలుగు: కేసీఆర్ సర్కార్ వెంటిలేటర్ పై ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కామెంట్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి ఎప్పుడు బయటకు పోతారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. శుక్రవారం ములుగు, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ మతతత్వ పార్టీయే.. నేను మతతత్వ వాదినే.. 80 శాతమున్న హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే మేం చేసేదేమీ లేదు. ఒక వర్గానికి కొమ్ముకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దు” అని సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఓటే అడగని కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. ‘‘అయ్య ఏక్ నంబర్.. కొడుకు దస్ నంబర్” అని కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలపై లేఖల పేరుతో కొత్త డ్రామాకు తెరతీసిందని సంజయ్ ఫైర్ అయ్యారు. రైల్వే కోచ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం ఎకరం భూమి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వ్యాగన్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ కోసం 164 ఎకరాల వివాదాస్పద భూమి ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర సర్కార్ వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమిచ్చి, కోచ్ ఫ్యాక్టరీకి ఇచ్చినట్లుగా చెబుతోందని మండిపడ్డారు. వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం రూ.380 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.

సీఎం అవినీతిని కక్కిస్తం..

సీఎం కేసీఆర్ కు లాలూప్రసాద్ యాదవ్ మాదిరి జైలు భయం పట్టుకుందని సంజయ్ అన్నారు. సీఎం అవినీతి సొమ్మును పైసాపైసా కక్కిస్తామని చెప్పారు. ‘‘గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍ క్యాండిడేట్లకు ఓటేస్తే.. సీఎం కేసీఆర్‍ కండ్లు మరింత నెత్తికెక్కుతయ్‍. అప్పుడు నోటిఫికేషన్లు రావ్‍. టీచర్లు, ఉద్యోగులకు పీఆర్సీ రాదు. నిరుద్యోగులకు భృతి రాదు. ఇవన్నీ రావాలంటే కచ్చితంగా బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలి. అప్పుడే కేసీఆర్‍ ఫాంహౌస్ నుంచి బయటకొచ్చి నాలుగు పనులు చేస్తడు’’ అని సంజయ్‍ అన్నారు. 2023లో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.