లింగ వివక్ష ప్రయాణాల్లోనూ ఉందా ? సెలవుల్లోనూ తప్పని తిప్పలు.. వెకేషన్ అంటే ఎక్కువ పనేనా?

లింగ వివక్ష ప్రయాణాల్లోనూ ఉందా ? సెలవుల్లోనూ తప్పని తిప్పలు.. వెకేషన్ అంటే ఎక్కువ పనేనా?

సాధారణంగా ఎవరైనా టూర్ లేదా ట్రిప్ కి వెళ్లి వచ్చాక రిలాక్స్ అయ్యి  వచ్చారని అందరూ అనుకుంటారు. కానీ చాలా మంది భారతీయ మహిళల విషయంలో ఇది అస్సలు నిజం కాదు. కుటుంబంతో కలిసి వెళ్లే టూర్స్, హాలిడే ట్రిప్పులు  వారికి రిలాక్స్ ఇవ్వకపోగా శారీరక, మానసిక అలసట మిగిలిస్తున్నాయి. ఇందుకు కారణం ప్రయాణంలో కూడా లింగ వివక్ష (Gender Bias) కొనసాగడమే.

మహిళలకు ఇల్లు వదిలి బయటకు వెళ్లినా బాధ్యతలు మాత్రం వెంటే ఉంటాయి. కేరళకో, గోవాకో వెళ్లినా.. అక్కడ పిల్లల తిండి, బాధ్యతలు చూడటం, భర్తకు కావాల్సిన వస్తువులు సర్దడం, అందరికీ మందులు ఇవ్వడం, చిన్న చిన్న అవసరాలను గుర్తు చేయడం వంటి పనులన్నీ మహిళల పైనే పడుతుంటాయి. పురుషులు ప్రయాణ ఏర్పాట్లు చూసుకుంటే సరిపోతుంది కానీ, మహిళలు మాత్రం ఆ ప్రయాణం సాఫీగా సాగడానికి అవసరమైన  కేర్ టేకర్ పాత్రను పోషిస్తూనే ఉండాలి.

సెలవుల్లో అందరూ సరదాగా గడపాలి కాబట్టి, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మహిళలకు ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. పిల్లలు అల్లరి చేసినా, ఏడ్చినా... పెద్దవారికి ఇబ్బంది కలిగినా దాన్ని సర్దుబాటు చేయాల్సింది స్త్రీలే. ఒకవేళ మహిళలు వారికీ రెస్ట్  కావాలని పనులు చేయకపోతే, వారిని స్వార్థపరులుగా చూసే సామాజిక దృక్పథం మన దేశంలో ఉంది. అందుకే ఆడవాళ్లు  అలసటను దాచుకుని, అందరి కోసం నవ్వుతూ గడపాల్సి వస్తుంది. 

►ALSO READ | వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ మాయం!.. వ్యాధి నిరోధక శక్తికి బూస్టర్..

 నిజానికి సెలవుల కంటే తిరిగి వచ్చిన తర్వాత మహిళలపై పడే పని భారం ఇంకా ఎక్కువ. వెళ్లొచ్చిన తర్వాత సూట్‌కేసులు విప్పడం నుండి టూర్ వెళ్లొచ్చిన  బట్టలు ఉతకడం, ఇల్లు సర్దడం, వంటగదిని క్లిన్ చేయడం  వంటి పనులన్నీ చేసే సరికి, అసలు టూర్ ఎందుకు వెళ్ళామా అనిపించేంత అలసట వస్తుంది. దీంతో వాకేషన్ వల్ల రావాల్సిన ఉత్సాహం ఆవిరైపోతుంది.

నిజమైన హాలిడేస్ ట్రిప్ అంటే కేవలం ఊరు వదిలి వెళ్లడం కాదు, రోజూ చేసే బాధ్యతల నుండి కూడా రెస్ట్ తీసుకోవడం. ఇంటి పనుల్లో, పిల్లల సంరక్షణలో పురుషులు సమానంగా బాధ్యతలు  పంచుకున్నప్పుడే మహిళలకు అసలైన విశ్రాంతి లభిస్తుంది. మహిళలు కూడా  విశ్రాంతి తీసుకునే హక్కు ఉందని గుర్తించి, అప్పుడప్పుడు ఒంటరిగానో లేదా స్నేహితులతోనో ప్రయాణాలు చేయడం  సెల్ఫ్ -కేర్ ఒక భాగమని గుర్తించాలి. అప్పుడే సెలవులకు పూర్తి అర్థం ఉంటుంది.