యూనియన్ నాయకులవి పిచ్చిమాటలు: సీఎం కేసీఆర్

యూనియన్ నాయకులవి పిచ్చిమాటలు: సీఎం కేసీఆర్
  • వాళ్లని నమ్మి కార్మికుల సమ్మె..48 వేల మంది ఉద్యోగాలు వదులుకున్నారు
  • ఆర్టీసీని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు: ముఖ్యమంత్రి

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది అసలు సమ్మె కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది ప్రజలను ఇబ్బందిపెట్టే చట్ట విరుద్ధమైన చర్య అని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీపై సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్.. మాట్లాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టిన కార్మికులను క్షమించేది లేదన్నారు. యూనియన్ నాయకుల పిచ్చిమాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా డ్యూటీకి గైర్హాజరయ్యారని, వాళ్లంతట వాళ్లే ఉద్యోగాలను వదులుకున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులను ఎవరూ డిస్మిస్ చేయలేదని చెప్పారు.

యూనియన్ నాయకుల వల్లే..

గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారని యూనియన్ నాయకులపై కేసీఆర్ మండిపడ్డారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారని అన్నారు. సమ్మెలో ఉన్నవారిని ఇక విధుల్లోకి తీసుకునేది లేదని చెప్పారు. వారితో చర్చలు జరిపే ప్రశ్నే లేదన్నారు.

పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదని కేసీఆర్ చెప్పారు. ఈ సమ్మె విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్లకుండా విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికులకు సెప్టెంబర్ నెల జీతం వెంటనే విడుదల చేస్తామన్నారు.