కుమార్తె పెళ్లిలో తండ్రికి ఊహించని కానుక ఇచ్చిన సీఎం కేసీఆర్

కుమార్తె పెళ్లిలో తండ్రికి ఊహించని కానుక ఇచ్చిన సీఎం కేసీఆర్
  • సివిల్​ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్​గా కరీంనగర్ మాజీ మేయర్​ రవీందర్​ సింగ్
  • సర్దార్ బిడ్డ పెండ్లికి హాజరైన కేసీఆర్​
  • ఆ తర్వాత గంటల్లోనే ఉత్తర్వులు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​ మాజీ మేయర్​ రవీందర్​సింగ్ ​కూతురి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్.. ​సర్దార్​కు ఊహించన కానుక ఇచ్చారు. కేసీఆర్​ముందుగానే అనుకున్నారో, లేదంటే పెండ్లి పందిట్లో నిర్ణయం తీసుకున్నారోగానీ సింగ్​ను సివిల్​సప్లై కార్పొరేషన్ చైర్మన్​గా నియమించారు. ఈ మేరకు సర్కారు తరుఫున బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెండ్లికి సీఎం హాజరైన గంటల వ్యవధిలో రవీందర్​సింగ్​కు అనూహ్యంగా పదవి దక్కడం గమనార్హం. కూతురు పెండ్లిలో తండ్రికి ఊహించని కానుక దక్కిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్​అయ్యాయి.

ఇద్దరిని కలిపి పనిచేయించేందుకే...

కరీంనగర్​లో గురువారం జరిగిన రవీందర్ సింగ్ కూతురు పూజా కౌర్ వివాహానికి సీఎం కేసీఆర్​ మధ్యాహ్నం హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు. తర్వాత మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి, అక్కడ 40నిమిషాల పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. తర్వాత హెలీకాప్టర్​లో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో రవీందర్​సింగ్​ను ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్​చైర్మన్​గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. సివిల్​సప్లైస్ మంత్రిగా ఉన్న గంగులకు పార్టీ సీనియర్ నేత రవీందర్​సింగ్​కు మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్నాళ్లపాటు టీఆర్ఎస్​హైకమాండ్​ కూడా సింగ్​ను పక్కనపెట్టింది. కార్పొరేటర్​గా గెలిచినప్పటికీ మేయర్​గా చాన్స్ ఇవ్వలేదు. దీంతో పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన రవీందర్​సింగ్, లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రూలింగ్ పార్టీకి పోటీగా ఇండిపెండెంట్​గా బరిలో నిలిచారు. టీఆర్ఎస్​అభ్యర్థిని ఓడిస్తారనే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చారు. ఆ టైమ్​లో త్వరలోనే టీఆర్ఎస్​ను వీడుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని రోజులకు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత టీఆర్ఎస్​పేరును బీఆర్ఎస్​గా మార్చి, జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేసీఆర్​ఇటీవల ఢిల్లీ పర్యటనకు సర్దార్​ను వెంటపెట్టుకొని వెళ్లారు. ఈ క్రమంలో సివిల్​సప్లైస్ చైర్మన్​గా రవీందర్ సింగ్ ను నియమించడంపై చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇద్దరినీ కలిపి పనిచేయించేందుకే సింగ్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.