- కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు సుగుణాకర్ రావు
కరీంనగర్ సిటీ, వెలుగు: రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర చెల్లించాలని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు సుగుణాకర్ రావు కోరారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట ఉత్పత్తులకు సరైన ధర రాని కారణంగా చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులను ఎంచుకుంటున్నారని తెలిపారు.
మన దేశంలో దాదాపు 70 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. పంటల ధరలకు సంబంధించి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
రైతు నాయకుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అధిక మోతాదులో క్రిమిసంహారక ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గిపోతోందని, మనుషులకు క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, హైపర్ టెన్షన్వంటి అనేక జబ్బులు వస్తున్నాయని చెప్పారు. కేవీకే శాస్త్రవేత్త వేణుగోపాల్ మాట్లాడుతూ.. పూల తోటల పెంపకం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. వృద్ధాప్యంలో ఉన్న రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ చెల్లించాలని కోరారు. డాక్టర్ బీఎన్.రావు, రైతు నాయకులు మల్లారెడ్డి, నేలమడుగు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
