- నిధుల ఇవ్వలేమని తేల్చి చెప్పిన టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ
- రాష్ట్ర ప్రభుత్వంపై పడనున్న భారం
- నిధుల కొరతతో ఆలస్యం అవుతున్న తరలింపు
మంచిర్యాల, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలోని గ్రామాల తరలింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇందుకు అవసరమైన నిధుల విడుదలపై నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీసీఏ) చేతులెత్తేయడంతో ఆ భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. నిధుల కొరత కారణంగా ఈ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. మొదటి విడతలో కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను తరలించగా, రెండో విడతలో జన్నారం మండలంలోని మల్యాల, దొంగపల్లి, అల్లీనగర్ గ్రామాల తరలింపు అటకెక్కింది.
రెండు గ్రామాలతో సరి
కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ఏరియా పరిధిలో దాదాపు 30 గ్రామాలు ఉన్నాయి. ముందుగా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్, జన్నారం మండలంలోని మల్యాల, దొంగపల్లి, అల్లీనగర్ గ్రామాలను తరలించాలని నిర్ణయించారు. రాంపూర్, మైసంపేట గ్రామాలను గత సంవత్సరం షిఫ్ట్ చేసిన ఆఫీసర్లు వీరికి కడెం మండలంలోని మద్దిపడగ వద్ద పునరావాసం కల్పించారు.
అయితే అక్కడ వారికి సరైన సౌలత్‌లు లేకపోవడం, పునరావాస ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందకపోవడంతో వారు మళ్లీ అడవిబాట పడుతున్నారు. ఇదిలా ఉండగా సెకండ్ ఫేజ్‌లో మల్యాల, దొంగపల్లి, అల్లీనగర్ గ్రామాలను హాజీపూర్ మండలం ముల్కల్ల సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు ప్రపోజల్స్ తయారుచేసి ఎన్టీసీఏకు పంపించారు. అయితే గ్రామాల షిఫ్టింగ్‌కు అవసరమైన అనుమతులు ఇస్తామని, నిధులు మాత్రం ఇవ్వలేమని ఎన్టీసీఏ స్పష్టం చేయడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.
2022లో చేసిన సర్వే ప్రకారం మల్యాలలో 103, దొంగపల్లిలో 106, అల్లీనగర్‌లో 108 కలిపి మొత్తం 317 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కో ఫ్యామిలీకి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.15 లక్షలు లేదా మూడు ఎకరాల భూమి ఇవ్వనున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా ఒక యూనిట్‌గా పరిగణిస్తూ వారికి పునరావాసం కల్పించనున్నారు. గ్రామాల తరలింపు ఆలస్యం అవుతుండడంతో అక్కడి గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ గ్రామాలను ఎలాగూ తరలించాలని నిర్ణయించడంతో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు.
పులుల ఆవాసానికి అడ్డంకులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం కేంద్రంగా 2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేశారు. కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని కోర్, బఫర్ జోన్లుగా విభజించారు. కోర్ఏరియా పరిధిలో మొత్తం 30 గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో మనుషులు, పశువుల అలికిడి ఎక్కువగా ఉండడంతో పెద్దపులుల ఆవాసానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. తరచుగా పులులు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా టైగర్ జోన్ల నుంచి కవ్వాల్‌కు వచ్చిపోతున్నప్పటికీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. ఈ కారణంగా కోర్ఏరియాలోని గ్రామాలను అటవీ ప్రాంతం బయటకు తరలించాలని ఎన్టీసీఏ నిర్ణయించింది.
కానీ నిధులు విడుదల చేయకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కవ్వాల్ కోర్ఏరియాలోకి పులులను ఆకర్షించేందుకు ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నారు. శాకాహార జంతువుల సంరక్షణ కోసం గడ్డి మైదానాలు, నీటి సౌకర్యం, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ కీలకమైన గ్రామాల తరలింపు విషయంలో ఎన్టీసీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కేవలం రూ.50 కోట్ల ఖర్చుకు వెనుకడుగు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.
