భిక్షమయ్యకు కేసీఆర్​ ఝలక్

భిక్షమయ్యకు కేసీఆర్​ ఝలక్
  • ఎమ్మెల్సీ ఆశలపై నీళ్లు  
  • అనుచరుల అసంతృప్తి  
  • ఆలేరు టికెట్ పై ధీమా

యాదాద్రి, వెలుగు: గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడం ఖాయమని ఆశతో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్​కు సీఎం కేసీఆర్​ ఝలక్​ ఇచ్చారు. ఈ కోటాలో దాసోజు శ్రవణ్​, కుర్ర సత్యనారాయణను ఎంపిక చేస్తూ సోమవారం కేబినెట్​ నిర్ణయం తీసుకుంది.  భిక్షమయ్యకు ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తారని ధీమాగా ఉన్న ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఆలేరు నుంచి  బూడిద భిక్షమయ్య గౌడ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.  ఆయన 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే  పోటీ చేసినా  ఓటమి పాలయ్యారు.  కాంగ్రెస్​లో  కోమటిరెడ్డి బ్రదర్స్​తో  ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. 

2018 ఎన్నికల్లో తన  ఓటమికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  కారణమని ఆరోపిస్తూ భిక్షమయ్య బీఆర్ఎస్​లో చేరారు. బీఆర్​ఎస్​లోనూ  తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో బీజేపీలో చేరారు.  గత ఏడాది  నవంబర్​లో  జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  భిక్షమయ్యను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతిభవన్​కు పిలిపించుకొని మాట్లాడారు. 

త్వరలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్​ స్పష్టమైన హామీ ఇచ్చారని, దాంతో ఆయన మళ్లీ బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టు ప్రచారం జరిగింది.  జిల్లా నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయిన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం గత మార్చి 29న ముగిసింది. ఆయన ప్లేస్​లో జిల్లాకు చెందిన భిక్షమయ్యగౌడ్​తో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​కు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరిగింది.  కానీ, అప్పుడూ నిరాశే ఎదురైంది.  గవర్నర్​ కోటాలో తప్పకుండా ఛాన్స్​ వస్తుందని నమ్మకంగా ఉన్న భిక్షమయ్యకు మళ్లీ   మొండిచేయి ఇచ్చారు.     

ఆలేరు టికెట్​పై  ఆశ

తమ నాయకుడికి  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని   నిలుపుకుంటారని భిక్షమయ్య వర్గం నమ్మకంతో ఉంది. ఎమ్మెల్సీ  చేయనందున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  ఆలేరు నుంచి టికెట్ ఇస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలేరు నుంచి ప్రాతినిధ్యం  వహిస్తున్న  గొంగిడి సునీతను పక్కన బెట్టి  భిక్షమయ్యకు టికెట్ ఇస్తారా అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.